బీసీల అగ్రపథం.. చంద్రబాబు సంకల్పం
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:41 AM
‘జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న అణగారిన వర్గాలకు రాజ్యాధికారమే అసలైన లక్ష్యం కావాలి, అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది’ అని చెప్పిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాటలో నడుస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
‘జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న అణగారిన వర్గాలకు రాజ్యాధికారమే అసలైన లక్ష్యం కావాలి, అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది’ అని చెప్పిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాటలో నడుస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. బలహీన వర్గాలకు కేవలం ఆర్థిక సాయం మాత్రమే సరిపోదని, నిర్ణయాలు తీసుకునే చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే వారి హక్కులు, రక్షణ చట్టాలు సరిగ్గా అమలవుతాయనేది ఆయన భావన. అందుకే చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల్లో బీసీలకు దూరమైన 34శాతం రిజర్వేషన్ల కల్పనకు నడుం బిగించారు. జగన్ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలకు స్థానిక సంస్థల్లో దూరమైన 16,800 పదవులు బీసీలకు అందజేసేలా చంద్రబాబు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 1983 నుంచి నేటి వరకూ టీడీపీ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తూ వస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియలో కీలకమైన రాజకీయ విప్లవానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలకు 20శాతం ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లను అమలు చేశారు. ఎన్టీఆర్ అందజేసిన ప్రోత్సాహంతో దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్ సహా ఎందరో బీసీ నేతలు పాలనలో నూతన ఒరవడులు సృష్టించారు. వారే కాకుండా, స్థానిక సంస్థల్లోనూ బీసీ నాయకత్వం భళా అనిపించుకుంది.
ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అందుకున్న చంద్రబాబునాయుడు మొదటి నుంచి బీసీలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. 1987లోనే ఎన్టీఆర్ బీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే, చంద్రబాబు ఆ సంఖ్యను 34శాతానికి పెంచారు. ఆనాడు బీసీల రాజకీయ ప్రాధాన్యానికి తీసుకున్న నిర్ణయం మరెందరో బీసీ నేతలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యమయ్యే అవకాశం కలిగించింది. తరవాత వచ్చిన ప్రభుత్వాలు కూడా బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చాయి. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్... నా బీసీలంటూనే విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. బీసీలు ఎప్పుడూ టీడీపీ పక్షమేనని వారిపై జగన్ కక్షగట్టారు. రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా మేలు చేసే ‘ఆదరణ’ వంటి పథకాలను కూడా రద్దు చేశారు. బీసీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారు. ముఖ్యంగా బీసీలకు రాజకీయ అండదండలు అందజేసే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు 10శాతం మేర కోత పెట్టారు.
ఎన్నికల సమయంలో నారా లోకేశ్ తన పాదయాత్రలో బీసీల సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ వచ్చారు. జగన్ అసమర్థ, కక్షపూరిత పాలనతో విసిగివేసారిన బీసీలు... చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విజయమిచ్చారు. అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు... బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా బడ్జెట్‌లో ఇవ్వనన్ని నిధులు కేటాయించారు. ఒకవైపు ఆర్థిక భరోసానిచ్చే పథకాలు అమలుచేస్తూనే... మరోవైపు సామాజిక రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం అమలుకు సిద్ధమవుతున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో చరిత్రలో బీసీలు ఎరుగని పథకాలు, నిధులు సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు. బీసీలకు మొదటి బడ్జెట్‌లో రూ.39 వేల కోట్లు. రెండో బడ్జెట్‌లో రూ.47 వేల కోట్లు, మూడో బడ్జెట్‌లో రూ.51 వేల కోట్లు కేటాయించారు. చట్టసభలలో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వ తదుపరి చర్యకు పంపించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. నిధుల కేటాయింపే కాదు... సంక్షేమ పథకాలను అదే స్థాయిలో అమలు చేస్తున్నారు. అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గీత కార్మికులకు మద్యం షాపులు, బార్లు వంటి వాటిల్లోనూ 10శాతం మేర కేటాయించారు. మద్యం షాపుల లైసెన్స్‌లో 50శాతం రాయితీ ఇచ్చారు. వడ్డెరలకు క్వారీల కేటాయింపుల్లో 33శాతం మేర రిజర్వేషన్లు, 50శాతం మేర సినరేజీ మినహాయింపు ఇచ్చారు. చేపల వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి 20 వేలకు పెంచారు. నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.20 వేల నుంచి 25 వేలకు పెంచారు.
నేతన్నలకు 200లు, 500 యూనిట్ల ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, నేతన్నల సేవలో పథకం కింద రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీపం–2 కింద 13.46 లక్షలకు పైగా బీసీ లబ్ధిదారులకు రూ.5,085.93 కోట్లు చెల్లించారు. తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున 10.46 లక్షల మంది బీసీ విద్యార్థులకు రూ.1,360.61 కోట్లు అందజేశారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే బీసీలకు కూటమి ప్రభుత్వం అదనంగా రూ.20 వేల రాయితీ అందజేస్తున్నది. ఆదరణ 1, ఆదరణ 2 పథకాల కంటే మరింత మెరుగ్గా బీసీ లబ్ధిదారులకు సాంకేతిక పరికరాలు అందజేయాలన్న ఉద్దేశంతో రూ.1,000 కోట్లతో ఆదరణ 3.0ను చంద్రబాబు అమలు చేయబోతున్నారు. రాజకీయ, ఆర్థిక గుర్తింపుతో పాటు బీసీలకు నాణ్యమైన విద్య అందజేయాలన్న ఉద్దేశంతో బీసీ గురుకులాలు, హాస్టళ్లను అభివృద్ధి చేస్తున్నారు. మెగా డీఎస్సీ పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా బీసీ అభ్యర్థులకు 26 జిల్లాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 5,720 మందికి ఉచిత శిక్షణ అందజేశారు.
బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ... ఆ సామాజికవర్గానికి చెందిన మహానీయుల జయంతులను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నాం. వాల్మీకి మహర్షి, వడ్డే ఓబన్న, మొల్ల, సర్దార్ గౌతు లచ్చన్న, భక్త కనకదాస జయంతులను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 200 ఏళ్ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాం. అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ, ప్రజాబంధు ప్రగడ కోటయ్య, శెట్టి బలిజల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతులను కూడా రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నాం. బీసీ కులాలను, వృత్తులను పేరు పేరునా గుర్తించుకుంటూ సీఎం చంద్రబాబు నాయుడు వారి అభ్యున్నతికి, రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపునకు అహర్నిశలూ కృషి చేస్తున్నారు.
ఎస్. సవిత
బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ,
చేనేత, జౌళి శాఖ మంత్రి