Share News

శత వసంతాల విద్యా కల్పవృక్షం

ABN , Publish Date - Apr 26 , 2026 | 03:17 AM

తెలుగుజాతి విద్యా చరిత్రలో ఏప్రిల్‌ 26 ఒక స్వర్ణాక్షర దినం. 1926, ఏప్రిల్‌ 26న ఒక చిన్న విత్తనంగా నాటబడి కాలానుగుణంగా మహావృక్షంగా విస్తరించిన ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఆంధ్రా యూనివర్సిటీ) వందేళ్ల మైలురాయిని అధిగమిస్తోంది.

శత వసంతాల విద్యా కల్పవృక్షం

తెలుగుజాతి విద్యా చరిత్రలో ఏప్రిల్‌ 26 ఒక స్వర్ణాక్షర దినం. 1926, ఏప్రిల్‌ 26న ఒక చిన్న విత్తనంగా నాటబడి కాలానుగుణంగా మహావృక్షంగా విస్తరించిన ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఆంధ్రా యూనివర్సిటీ) వందేళ్ల మైలురాయిని అధిగమిస్తోంది. ఒక ప్రాంతీయ విద్యా అవసరానికి రూపం దాల్చిన ఈ విశ్వవిద్యాలయం, కాలక్రమేణా తెలుగుజాతి మేధస్సుకు దిశానిర్దేశం చేసే ధ్రువతారగా వెలుగొందింది. సంప్రదాయ విద్యల పునాదులపై నిలబడి, ఎప్పటికప్పుడు మారుతున్న శాస్త్ర–సాంకేతిక పరిణామాలను ఒడిసిపట్టుకుంటూ, విజ్ఞాన వికాసానికి స్వతంత్ర వేదికగా నిలిచింది.

బ్రిటిష్ పాలన కాలంలో తెలుగు ప్రాంతంలో ఉన్నత విద్యకు స్వతంత్ర వేదిక లేకపోవడం మేధావులను కలవరపెట్టింది. తెలుగు భాష, సంస్కృతి, శాస్త్ర విజ్ఞాన వికాసానికి ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలన్న ఆలోచన ఒక విద్యా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఆ ఉద్యమానికి ప్రాణం పోసి, ఆలోచనకు రూపం ఇచ్చిన యుగదృష్టి గల మహామేధావి సర్ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి. ఆయన అంకితభావంతో చేసిన కృషి ఫలితంగానే ఆంధ్ర విశ్వకళాపరిషత్ మొదట గుంటూరులో ప్రభవించింది. ఇది కేవలం ఒక విద్యాసంస్థ స్థాపన కాదు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి, జాతి మేధస్సుకు గర్వకారణంగా నిలిచిన ఘట్టం. తర్వాత, విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని సముద్ర అలల సోయగాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.


విశ్వవిద్యాలయ ప్రారంభ దశలో జైపూర్ మహారాజు అందించిన భూరి విరాళం ఈ విద్యా వృక్షానికి బలమైన పునాది వేసింది. భవనాలు, వసతులు, అకడమిక్ విస్తరణకు ఈ సహాయం దోహదపడింది. తెలుగు ప్రాంతానికి చెందని రాజు అయినప్పటికీ, విద్యా విలువలను గుర్తించి ఆయన చేసిన ఈ సహకారం ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం.

ప్రారంభ దశలో ఆంధ్ర విశ్వకళాపరిషత్ పరిధి విశాఖపట్నానికి మాత్రమే పరిమితం కాలేదు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు విస్తరించిన అనేక డిగ్రీ కాలేజీలకు అనుబంధ విశ్వవిద్యాలయంగా ఇది వ్యవహరించింది. దీంతో ఆంధ్ర ప్రాంతమంతటా ఉన్నత విద్య ఒకే ప్రమాణంతో వికసించి, విద్యా వ్యవస్థకు స్పష్టమైన దిశానిర్దేశం లభించింది. ఇది ఉన్నత విద్య చరిత్రలో విప్లవాత్మక మలుపు.

ఆరంభంలో కళాశాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, న్యాయశాస్త్రం వంటి కొద్ది విభాగాలతోనే ఈ విద్యా ప్రయాణం మొదలైంది. విభాగాలు తక్కువైనా, బోధనలో లోతు, పరిశోధనలో నిబద్ధత ఎక్కడా రాజీపడలేదు. ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులను కేవలం పట్టభద్రులుగా కాదు, జాతి మేధస్సును శిల్పులుగా తీర్చిదిద్దింది. తర్వాతకాలంలో ఎందరో దేశ, విదేశాల్లోని విశ్వవిద్యాలయ ఉపకులపతులు, ఆచార్యులు, శాస్త్రసాంకేతక నిపుణులు, న్యాయవాదులు, జడ్జీలు, రాజకీయ నాయకులతోపాటు సినిమా దర్శకులు, కళాకారులను అందించింది.

ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఎదుగుదలలో ఉపకులపతులుగా సేవలందించిన మహామేధావుల పాత్ర మరువలేనిది. సర్ కట్టమంచి రామలింగారెడ్డి సంస్థ వ్యవస్థాపకుడుగానే కాకుండా ఉపకులపతిగా అకడమిక్ క్రమశిక్షణకు పునాదులు వేశారు. విద్య ద్వారా మానవ విలువలు వికసించాలన్న ఆయన తత్వం ఈ సంస్థకు ఆత్మగా మారింది. ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపకులపతిగా సేవలందిస్తూ, విశ్వవిద్యాలయాన్ని తన మేధో ప్రతిష్ఠతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అలాగే డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ ఉపకులపతిగా పరిపాలనా పటిష్ఠతకు, విద్యా ప్రమాణాల బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు. సర్ సి.వి.రామన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల మేధో ప్రభావం, డాక్టర్ సూరి భగవంతం వంటి విద్యావేత్తల ప్రత్యక్ష కృషి విశ్వవిద్యాలయాన్ని పరిశోధనలో అగ్రస్థానంలో నిలిపింది.


ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ప్రారంభ శాసనసభ సమావేశాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని టి.యల్.యన్ సభా హాల్ వేదిక అయింది. డా. వాసిరెడ్డి శ్రీకృష్ణ గ్రంథాలయం పరిశోధకులు, విద్యావేత్తలకు విజ్ఞాన దేవాలయంగా నిలిచింది. అలాగే కాన్వొకేషన్ హాల్, అసెంబ్లీ హాల్, నాటక రంగం వంటి ప్రాంగణాలు విద్యా, సాంస్కృతిక, దృశ్యమాధ్యమ కార్యక్రమాలకు కేంద్రాలుగా మారి, ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యతో పాటు ప్రజాస్వామ్య, సాంస్కృతిక చరిత్రలో కూడా విశిష్ట స్థానాన్ని సంపాదించింది.

కాలక్రమేణా ఆంధ్ర విశ్వకళాపరిషత్ విభాగాలపరంగా, కోర్సులపరంగా విస్తరించింది. సంప్రదాయ విద్యలతో పాటు కాలానుగుణంగా శాస్త్ర–సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆధునిక విద్యలకు నిలయంగా మారింది. వందకు పైగా విభాగాలు, పరిశోధనా కేంద్రాలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఇక్కడ జాతీయ–అంతర్జాతీయ పరిశోధన నిధులు, ప్రాజెక్టులతో విశ్వవిద్యాలయం విద్యా విప్లవానికి కేంద్రబిందువై, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచి, తమ మూలాలను గర్వంగా గుర్తుచేసుకుంటున్నారు.

సాహిత్యం, విద్య, విజ్ఞానం, మానవీయ విలువల వికాసానికి కృషి చేసిన ఆంధ్ర విశ్వకళాపరిషత్, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, తిరుపతి వెంకటకవులు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ఇందిరాగాంధీ, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, డా. యం.యస్.విశ్వనాథన్, డా. వై.నాయుడమ్మ, అక్కినేని నాగేశ్వరరావు, యన్.టి.రామారావు, డా. సి.నారాయణ రెడ్డి, పీసపాటి నరసింహమూర్తి వంటి అనేక మహనీయులను గౌరవ పురస్కారాలతో సత్కరించి తన విశిష్టతను దేశవ్యాప్తంగా చాటుకుంది.


ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల చరిత్రను వెనక్కి తిరిగి చూసుకుంటే అది విజయాల పరంపర. ముందుకు చూస్తే ఇది ఆశల దిశానిర్దేశం. నేడు వంద సంవత్సరాల గతాన్ని గౌరవంగా స్మరించుకుంటూనే, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నిలవడానికి సిద్ధమైంది. నూతన సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ భాగస్వామ్యాలతో తదుపరి శతాబ్దంలో మరింత వెలుగులు చిందించేందుకు సిద్ధమైంది. వంద సంవత్సరాల విద్యా వృక్షం – ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు జాతికి గర్వకారణం.

- నందిపాటి సుబ్బారావు

ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు

(ఆంధ్రా యూనివర్సిటీకి వందేళ్ళు)

Updated Date - Apr 26 , 2026 | 03:19 AM