నేతన్నల లోగిళ్లలో వెలుగులు
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:49 AM
చేనేత అంటే కేవలం వస్త్రమే కాదు.. లక్షల కుటుంబాలతో పెనవేసుకుపోయిన పోగు బంధం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ భాగం. దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడేది చేనేత రంగం పైనే.
కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధిపథంలో దూసుకెళుతోంది. ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డులలో 4 అవార్డులు చేనేత రంగానికే దక్కడం విశేషం. కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే.. చేనేత కుటుంబాలు గౌరవమైన, ఆర్థిక భరోసాతో కూడిన జీవనం సాగించడం. ఇందుకోసం ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంసిద్ధంగా ఉన్నారు.
చేనేత అంటే కేవలం వస్త్రమే కాదు.. లక్షల కుటుంబాలతో పెనవేసుకుపోయిన పోగు బంధం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ భాగం. దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడేది చేనేత రంగం పైనే. ముఖ్యంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా స్వదేశీ ఉద్యమం తరువాత చేనేత, ఖాదీ వస్త్రధారణ దేశ ప్రజల్లో నిత్యకృత్యమైపోయింది. ఇంతటి కీలకమైన రంగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అయిదు లక్షల కుటుంబాలకు పైగా ఉపాధి పొందుతున్నాయి. అందుకే, టీడీపీ ప్రభుత్వం నాటి నుంచీ చేనేత పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వస్తోంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ ‘కూడు–గూడు–గుడ్డ’ నినాదంతో చేనేత రంగానికి అండగా నిలిచారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తూ వస్తున్నారు. నూతన టెక్స్‌టైల్స్ పాలసీలు అమలుచేయడం, మెగా క్లస్టర్లు, టెక్స్‌టైల్స్ పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 2014–19 మధ్య రాష్ట్రంలో చేనేత రంగానికి స్వర్ణయుగం. త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేసి, ప్రభుత్వం అందించే వాటాను పెంచారు. పవర్ టారిఫ్‌లో 50శాతం రాయితీ ఇచ్చారు. 2014–19లో రూ.50.15 కోట్లతో 54 క్లస్టర్లు ఏర్పాటు చేశారు.
ఆ తరవాత, 2024లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా చేనేతలకు మరోసారి అండగా నిలిచింది. ఆయన దిశా నిర్దేశంలో అధికారులతో కలిసి చేనేత, జౌళిశాఖ మంత్రిగా ఎన్నో పథకాలు రూపొందించాను. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పింఛను మొత్తం పెంచాం. చేనేత కార్మికులకు త్రిఫ్ట్ ఫండ్ పథకం కింద ప్రభుత్వ వాటాను 8 నుంచి 16శాతానికి పెంచాం. ఈ పథకం కింద ప్రతి బడ్జెట్‌లోనూ రూ.5 కోట్ల చొప్పున కేటాయిస్తూ వస్తున్నాం. క్యాష్ క్రెడిట్ పథకం కింద సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నాం.
కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధిపథంలో దూసుకెళుతోంది. ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డులలో 4 అవార్డులు చేనేత రంగానికే దక్కడం విశేషం. ఆప్కోలో ఫోన్‌పే ద్వారా వస్త్రాలు కొనుగోలు, విధుల్లో పారదర్శకతకు ముఖాధారిత హాజరు, కొనుగోలు చేసిన వస్త్రాలకు కంప్యూటర్ బిల్లింగ్ వంటి సాంకేతికతలను ప్రవేశపెట్టాం. ఈ–కామర్స్ సంస్థల ద్వారా వినియోగదారుల ఇళ్లకు నేరుగా చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నాం. ఆప్కోలో చేపట్టిన సంస్కరణలతో చేనేత అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆప్కో చేపట్టిన సంస్కరణలు (డిజిటలైజేషన్)కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు లభించింది.
నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం కీలకమైన ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుడుతోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. మగ్గంపై నేసే నేతన్నలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ మగ్గాల నేతన్నలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయబోతున్నాం. ఈ పథకం ద్వారా ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640లు, మరమగ్గం నేతన్నలకు రూ.21,600లు ఆదా అవుతుంది. 1,04,000 వరకూ చేనేత కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతాయి. ఈ పథకం అమలైతే నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందనడంలో సందేహం లేదు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ.4 వేల పింఛను ఇస్తున్నాం. 15శాతం రాయితీపై ముడి సరుకు రాయితీ పథకం అమలు చేస్తున్నాం. 2,640 మంది చేనేత కార్మికులకు ముద్ర పథకం కింద రూ.24.43 కోట్లు అందజేశాం. 2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.78.73 కోట్ల నగదు పరపతి సౌకర్యం కల్పించాం.
నేతన్నల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిలో భాగంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా నేతన్నల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే నేతన్న భరోసా పథకం కింద చేనేతలకు 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నాం. గత వైసీపీ ప్రభుత్వం కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వనున్నాం. రాష్ట్రంలో నేతన్నల ఆదాయంతో పాటు చేనేత ఉత్పత్తుల పెంపునకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) కింద రూ.14 కోట్లతో చీరాల, ఎమ్మిగనూరు, రాజాం–పొందూరులలో క్లస్టర్లు ప్రతిపాదించాం. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి.పి)లో భాగంగా ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. పిఠాపురంలో రూ.15.01 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలో చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (ఎస్.సి.డి.పి)లో భాగంగా రూ.10.44 కోట్లతో పది క్లస్టర్లను మంజూరు చేశాం. సహాయక క్లస్టర్లతో పాటు ఇతర క్లస్టర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. చేనేత రంగ అభివృద్ధి కోసం ముడి సరుకులపై సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్ అందజేస్తూ, ఆధునిక డిజైన్లపై శిక్షణ అందిస్తున్నాం. ఆధునిక పనిముట్ల కొనుగోలుకు 90శాతం వరకు సబ్సిడీ కల్పించడం ద్వారా కార్మికుల ఉత్పాదకతను పెంచుతున్నాం.
గత ప్రభుత్వ తీరు వల్ల ఆప్కో నష్టాల్లో కూరుకుపోయింది. ఆప్కో పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.120 కోట్లను గత ప్రభుత్వం తీసుకొచ్చి, పక్కదారి పట్టించింది. దీనివల్ల ఆ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఆప్కోను గాడిలో పెడుతోంది. చేనేత సహకార సంఘాల బకాయిలను చెల్లిస్తున్నాం. చేనేత వస్త్రాలపై ఆప్కో, చేనేత సంఘాలకు జీఎస్టీ మినహాయింపు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ప్రత్యేక ఎగ్జిబిషన్లు నిర్వహించి 40–50 శాతం డిస్కౌంట్లతో చేనేత ఉత్పత్తులు విక్రయిస్తున్నాం. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆప్కో షోరూమ్‌లలో అమ్మకాలు పెరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేశ్ దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేనేత వస్త్రాలను ధరిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి పండుగకు రాష్ట్ర ప్రజలందరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలకు తోడ్పడాలని పిలుపునిస్తున్నారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే.. చేనేత కుటుంబాలు గౌరవమైన, ఆర్థిక భరోసాతో కూడిన జీవనం సాగించడం. ఇందుకోసం ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంసిద్ధంగా ఉన్నారు.
ఎస్. సవిత
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి
(ఏప్రిల్ 1 నుంచి ‘నేతన్నలకు ఉచిత విద్యుత్’)