పొగాకు రైతులను ఆదుకోవాలి
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:48 AM
భారత ప్రభుత్వం టొబాకో బోర్డు ద్వారా 2025–26 సీజన్‌లో 120 మిలియన్ల కేజీల వరకు పొగాకు పండించవచ్చని రైతులకు అనుమతి ఇచ్చింది. అంతే మొత్తంలో పండించినా, మే నెలాఖరుకు కనీసం 15 మిలియన్లు...
భారత ప్రభుత్వం టొబాకో బోర్డు ద్వారా 2025–26 సీజన్‌లో 120 మిలియన్ల కేజీల వరకు పొగాకు పండించవచ్చని రైతులకు అనుమతి ఇచ్చింది. అంతే మొత్తంలో పండించినా, మే నెలాఖరుకు కనీసం 15 మిలియన్లు కూడా వేలం కేంద్రాల ద్వారా కొనలేదు. దీనితో పెరిగిన ఖర్చులు, చేసిన అప్పులతో పొగాకు రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏపీలో 16, కర్ణాటకలో 10, మొత్తం 26 వేలం కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతాయి. ఈ సంవత్సరం డీలర్లు అందరూ సిండికేట్ అయి కనీస స్థాయిలో కూడా పొగాకు కొనకపోగా, వేలం కేంద్రానికి తెచ్చిన బేళ్లలో అధిక శాతం ‘రిజెక్ట్’ చేస్తున్నారు. వాటిని మరలా స్వగ్రామాలకు, కోల్డ్ స్టోరేజీలకు తరలించడానికి రైతులకు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ సంవత్సరం ఒక్కో పొగాకు బార్న్‌కు సుమారు 12 నుంచి 14 లక్షలు ఖర్చులయ్యాయి.
2024–25 సీజన్‌లో మన దేశం నుంచి 16,728 కోట్ల రూపాయల విలువైన 3,64,575 మెట్రిక్ టన్నుల పొగాకు ఎగుమతి జరిగింది. ఈ సీజన్‌లో మన రాష్ట్రంలో కనీసం 10 క్వింటాళ్లు కూడా పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు జరగలేదు. చైనా 21.28 లక్షల మెట్రిక్ టన్నులు పండించి మొదటి స్థానంలో, బ్రెజిల్ 6.83 లక్షల మెట్రిక్ టన్నులు పండించి మూడవ స్థానంలో ఉన్నాయి. నాణ్యమైన Flue Cured Vergenia రకం ద్వారా ప్రపంచం మొత్తానికి అద్భుతమైన క్వాలిటీ పొగాకు అందిస్తున్నది మన దేశం మాత్రమే. రెండో స్థానంలో ఉన్న మనం దేశవ్యాప్తంగా 4,91,370 హెక్టార్ల భూమిలో (12.5 లక్షల ఎకరాలు) వైట్ బర్లీ, బ్లాక్ బర్లీ, లంకలలో పండించే లంక (నాటు) పొగాకు... ఏదైతేనేమి రాష్ట్రంలో మొత్తం 7,69,670 మెట్రిక్ టన్నులు ఈ సీజన్‌లో పండించారు. మొత్తం దేశ ఎగుమతిలో 33శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నాణ్యమైన పొగాకు ఎగుమతి అవుతున్నది. 30,968 బార్న్‌ల నాణ్యమైన పొగాకును ప్రకాశం జిల్లా, తూర్పు గోదావరిలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, భద్రాచలం ప్రాంతంలోనూ పండిస్తున్నారు.
ఈ ఏడాదిలో బార్న్‌కు అయిదారు లక్షల నష్టం వస్తున్నదని పొగాకు రైతులు, రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలర్లు ఇంకొక నెల ఇలాగే కాలయాపన చేసి గోడౌన్లు ఖాళీ లేవని, యుద్ధాల కారణంగా షిప్పులు లోడింగ్ కాక ఎగుమతులు ఆగిపోయాయని... ఏవేవో కారణాలు చెప్పి కొనుగోళ్లు తగ్గిస్తారని అన్నారు. కాలం గడిచేకొద్దీ అప్పులు తెచ్చిన చోట రైతులపై ఒత్తిడి పెరిగి, తక్కువ రేట్లకు అమ్ముకునే పరిస్థితి తెస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగాకు రైతుల గురించి కూడా ఆలోచించి, 500 నుంచి 600 కోట్లు కేటాయించి మార్కెఫెడ్ లేదా రాష్ట్ర సొసైటీ ద్వారా వేలంలో పాల్గొంటే... ఐటీసీ, జీపీఐ లాంటి పెద్ద సంస్థలు కూడా వేలంలో మంచి రేటుతో పొగాకు కొంటారన్నారు. లేదంటే గతంలో లాగా కాకుండా క్వింటాలకు కేంద్ర ప్రభుత్వం 3,500, రాష్ట్ర ప్రభుత్వం 1500 చొప్పున రూ.5,000 ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు.
2000–01లో మన దేశం నుంచి 871 కోట్ల విలువైన 1.08 లక్షల టన్నుల పొగాకు ఎగుమతి కాగా, 2024–25 నాటికి 19 రెట్లు పెరిగి 26,728 కోట్ల విలువైన 3.75 లక్షల టన్నులు ఎగుమతి జరిగింది. దీంతో లక్షల మందికి ఉపాధి కలిగింది, వేలకోట్లలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాల నాయకులు టొబాకో బోర్డు కార్యాలయాల ముందు, జిల్లా కలెక్టరేట్ల ముందు భారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వేలంలో మైసూర్‌లో మేలైన రకం పొగాకు కేజీ రూ.280 నుంచి 315 వరకు కొంటున్నారు. మన రాష్ట్రంలో రూ.220 నుంచి 275 వరకు మాత్రమే కొన్నారు. ప్రపంచంలోనే మేలైన క్వాలిటీ పొగాకు ఉత్పత్తి మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది. కానీ బీజేపీ ప్రభుత్వం పొగాకుతో తయారు చేసిన వస్తువులపై గతంలో 18 నుంచి 22శాతం వరకు సెంట్రల్ ఎక్సైజ్ పన్నులు పెంచగా, ఈ మధ్యకాలంలో దానిని 40శాతం వరకు పెంచి పొగాకు పరిశ్రమపై ఆధారపడిన కోట్ల మంది నడ్డి విరిచింది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పొగాకు పంటకు రైతులు స్వస్తి చెప్పే పరిస్థితులు వస్తాయి. అప్పుడు దానిపై ఆధారపడిన కోట్ల మంది రోడ్డున పడతారు. కాబట్టి పెంచిన టాక్స్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య డిమాండ్ చేస్తున్నది. అలాగే పొగాకు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపి, వారి సహకారం కోరాలని రాష్ట్ర సమాఖ్య విజ్ఞప్తి చేస్తున్నది.
బెజవాడ వెంకట్రావు
జనరల్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య
ఇవి కూడా చదవండి..
అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు గల్లంతు
మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు