జనాభా పెంపు.. ముందుచూపు పథకం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:45 AM
ఆంధ్రప్రదేశ్‌లో జనాభా తగ్గిపోతోందని, ఒక్కొక్క జంట కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని, మూడో, నాలుగో సంతానాన్ని కంటే నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై...
ఆంధ్రప్రదేశ్‌లో జనాభా తగ్గిపోతోందని, ఒక్కొక్క జంట కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని, మూడో, నాలుగో సంతానాన్ని కంటే నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై కొందరు మేధావులు, వామపక్ష, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఉన్న యువతకే అవకాశాల్లేవు, అదనంగా పుట్టే వారికి ఉపాధి ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5శాతంగా ఉండగా, దేశవ్యాప్తంగా 1.9శాతంగా ఉంది. దేశ ఆర్థిక వృద్ధి నిలకడగా కొనసాగాలన్నా, సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలన్నా సంతానోత్పత్తి రేటు... కనీసం రీప్లేస్‌మెంట్ లెవల్ అయిన 2.1శాతానికి తగ్గకూడదు. లేకపోతే దేశంలో పనిచేసే వారి సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరుగుతుంది.
2060 నాటికి మన దేశ జనాభాకు ఒక్కరు కూడా అదనంగా చేరరని అంచనాలు చెబుతున్నాయి. కొత్తగా జనాభాలో చేరే యువకుల సంఖ్య నామమాత్రం అవుతుంది. సంతానోత్పత్తి రేటు తగ్గుదలను అరికట్టలేకపోతే త్వరలోనే మన దేశంలో కూడా ఆ రేటు ఒక శాతానికి చేరి జపాన్, దక్షిణ కొరియా, ఇటలీతో పాటు ఇతర యూరప్ దేశాల మాదిరి వృద్ధుల దేశంగా మారుతుంది. దీంతో పనిచేసేవారు లేక దేశ కొనుగోలు శక్తి తగ్గుతుంది. వృద్ధులు పెరగడంతో సంక్షేమ ఖర్చు పెరుగుతుంది. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెడుతుంది. జపాన్‌లో 50శాతం వృద్ధులున్నారు. అక్కడ భారీగా పెట్టుబడులు, కొత్త టెక్నాలజీ కూడా అందుబాటులో ఉన్నా పనిచేసేవారు లేరు. జనాభా పెరగనంత వరకు వారి వృద్ధి రేటు 0.8శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. సంతానోత్పత్తి రేటు దీర్ఘకాలంగా రీప్లేస్‌మెంట్ లెవల్ కన్నా తక్కువగా ఉన్న దక్షిణ కొరియాతో పాటు ఇతర యూరప్ దేశాల వృద్ధి రేటు కూడా 1 నుంచి 2శాతం లోపే ఉంది. చైనాలో కూడా సంతానోత్పత్తి రేటు 1కి చేరుకోవడంతో అప్పటి వరకు 10శాతంగా ఉన్న వృద్ధి రేటు 5శాతానికి పడిపోయింది. దీంతో చైనా ‘ఒక బిడ్డ’ పాలసీని వదిలేసి ముగ్గురు బిడ్డలను కనాలంటూ తమ దేశ ప్రజలను ప్రోత్సహిస్తోంది.
చైనాతో పాటు ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలనే చంద్రబాబు చెబితే, మేధావులకు ఎందుకు నచ్చడం లేదు? పని చేయలేని జనాభా తగ్గిపోవడంతో ఉండే నష్టాలను వీరు ఎలా విస్మరించారు. పట్టణీకరణ, ఉన్నత విద్య, వర్క్ ఫోర్స్‌లో మహిళల పాత్ర పెరగడం, ఆలస్యంగా పెళ్లిళ్లు లాంటి సమాజంలో వచ్చే నిర్మాణాత్మక మార్పుల కారణంగా సంభవించే ఫలితాలను మనం ఆపలేమని మరికొందరు అంటున్నారు. జనాభా తగ్గుదల విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ముందే మేల్కొనాలని చంద్రబాబు చెబుతున్నారు. అయితే జనాభా తగ్గుదలను ఆపాలంటే కేవలం పేద మహిళలను ఆకర్షించే కొద్దిపాటి నగదు ప్రోత్సాహకాలు సరిపోవు. వారి సంతానానికి విద్య, వైద్య సౌకర్యాలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసానివ్వాలి. వీరితో పాటు వైట్ కాలర్ జాబ్స్ చేసే మహిళలు ఎక్కువ సంతానాన్ని కనేందుకు ప్రోత్సాహకాలు కల్పించాలి. ఇందులో ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయాలి. భారతదేశ కుటుంబ వ్యవస్థపై పాశ్చాత్య ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలి.
గమిడి శ్రీనివాస్
ఇవి కూడా చదవండి..
అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు గల్లంతు
మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు