Share News

ఆంధ్రావనికి పచ్చదనాన్ని అద్దుతున్నారు!

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:47 AM

మానవ మనుగడకు మూలాధారం ప్రకృతే అన్న మౌలిక వాస్తవాన్ని విస్మరించి ఆధునిక మానవుడు పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్నాడు.

ఆంధ్రావనికి పచ్చదనాన్ని అద్దుతున్నారు!

మానవ మనుగడకు మూలాధారం ప్రకృతే అన్న మౌలిక వాస్తవాన్ని విస్మరించి ఆధునిక మానవుడు పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్నాడు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నిర్దిష్టమైన ప్రకృతి నియమాల్ని పాటించడం, పటిష్ఠ చట్టాల్ని రూపొందించడం అత్యవసరం. కూటమి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు తోడు, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తోంది.

దీనిలో భాగంగానే రాజధాని అమరావతిలో దాదాపు 51శాతం భూమి గ్రీన్ & బ్లూ జోన్ కోసం కేటాయించారు. ఇది ప్రపంచంలో ఏ రాజధానిలోనూ లేనంత ఎక్కువ. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రెండు లక్షల మొక్కలు నాటారు. 200 ఎకరాల్లో సఫారీ పార్కు, జింకల అభయారణ్యం ప్లాన్ చేస్తున్నారు. రోడ్ల మధ్యలో మామిడి, వేప, రావి, మర్రి లాంటి 25 రకాల చెట్లు పెంచే ప్రణాళిక చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన సెక్రెటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలన్నీ గ్రీన్ బిల్డింగ్స్. ప్రతి భవనంపైనా సోలార్ ప్యానెల్స్, వర్షపు నీటి సేకరణ, పైకప్పుపై గార్డెన్ లాంటి ఏర్పాటు చేశారు. హైకోర్టు భవనం చుట్టూ 50 ఎకరాల పార్క్ నిర్మించారు. అమరావతి అంటే కేవలం సిమెంట్ భవనాలు కాదు, అది మనిషి ప్రకృతితో కలిసి జీవించే రాజధాని అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతున్నారు.


2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50శాతం మేర గ్రీన్ కవర్ సాధించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే ఏపీ– గ్రీన్ కమిటీని ఏర్పాటు చేసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొణిదెల నాగబాబును నియమించింది. అటవీ విస్తీర్ణం పెంపు, పర్యావరణ పరిరక్షణ, హరితాంధ్ర వంటి కార్యక్రమాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. మరోవైపు ప్రకృతి విపత్తుల నుంచి తీరాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని అటవీశాఖ గ్రేట్ గ్రీన్‌వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం తీర ప్రాంతం పొడవునా 5 కి.మీ వెడల్పుతో పర్యావరణ కారిడార్ ఏర్పాటు చేయనుంది. తీరానికి జీవ రక్షణ కవచంగా దీన్ని తీర్చిదిద్దనుంది. మొత్తం మూడు జోన్లతో గ్రేట్ గ్రీన్‌వాల్‌ను ఏర్పాటు చేయనుంది. విపత్తులు, తుపానులు, సునామీల నుంచి రక్షణ, పెనుగాలుల వేగాన్ని నియంత్రించేందుకు, సముద్ర మట్టాల పెరుగుదల, తీరప్రాంత కోతను అడ్డుకునేందుకు ఈ గ్రేట్ గ్రీన్‌వాల్ ఉపయోగపడుతుంది. దీంతో రాష్ట్రంలోని తీర ప్రాంతాలు హరిత వనాలుగా మారనున్నాయి. తుపాన్ల సమయంలో అలల ఉధృతికి, తీరంలోని ఇసుక కోతలకు గురికాకుండా మడ చెట్ల వేర్లు బలమైన వలలుగా పనిచేస్తుంటాయి. రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో 54వేల హెక్టార్ల మడ అడవులు విస్తరించి ఉండేవి. ఇప్పుడు వాటిలో చాలావరకు నాశనమైపోయాయి.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో 740 హెక్టార్లు, 2025–26లో 1,930 హెక్టార్ల మేర మడ అడవుల విస్తరణ చేపట్టింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మన రాష్ట్రంలో అపారమైన సంపదకు నిలయమైన సముద్ర తీరప్రాంతం ఏటా దాదాపు 10కి.మీ చొప్పున కోతకు గురవుతున్నట్లు అంచనా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసే పరిణామమిది. దీనివల్ల భూగర్భ జలాలు సముద్ర ఉప్పునీటితో కలుషితమవుతాయి. తీరప్రాంత కోత, అక్కడ సంభవించే వరదల వల్ల భారతదేశం ఏటా 500 కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నట్టు అంచనా. పదేపదే సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ–మద్రాస్‌కు అప్పగిస్తూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది.


అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నగర వన యోజనతో పాటు రాష్ట్ర నిధులనూ సమకూర్చుకుని, కాంక్రీట్ జంగిల్స్ మధ్య గ్రీన్ లంగ్స్‌లా పనిచేసే నగర వనాలను కూటమి ప్రభుత్వం నిర్మిస్తోంది. పారిశ్రామిక ప్రగతితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యమిచ్చేలా ప్రతి పరిశ్రమ తన పరిధిలోని భూభాగంలో 33శాతాన్ని పచ్చదనంతో నింపాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేసే విధంగా రూపొందించిన ప్రణాళిక కూడా మంచి ఫలితాన్నిస్తోంది.

మానవ తప్పిదాల కారణంగా భూ వాతావరణంలో ఇప్పుడు వస్తున్న మార్పులు ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సగటు ఉష్ణోగ్రతలు పెరిగి మరిన్ని విపత్తులు, ఉపద్రవాలు తప్పవు. అందుకే పర్యావరణ పరిరక్షణ పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయడం ఎంతైనా అవసరం. అప్పుడే కూటమి ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ లక్ష్యం నెరవేరుతుంది.

- కూసంపూడి శ్రీనివాస్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

Updated Date - Sep 04 , 2026 | 04:49 AM