Share News

ఉన్నత విద్యా ప్రమాణాలు సమున్నతమయ్యేనా?

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:58 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 27న జారీ చేసిన జీవో రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థలో చర్చకు తెర తీస్తున్నది. ఇప్పటివరకు విడివిడిగా పనిచేస్తున్న కమిషనరేట్ ఆఫ్‌ కాలేజియేట్ ఎడ్యుకేషన్...

ఉన్నత విద్యా ప్రమాణాలు సమున్నతమయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 27న జారీ చేసిన జీవో రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థలో చర్చకు తెర తీస్తున్నది. ఇప్పటివరకు విడివిడిగా పనిచేస్తున్న కమిషనరేట్ ఆఫ్‌ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (CCE), కమిషనరేట్ ఆఫ్‌ టెక్నికల్ ఎడ్యుకేషన్ (CTE) వ్యవస్థలను ఏకీకృతం చేసి కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (CHE) అనే ఒకే నోడల్ సంస్థ ఏర్పాటు ఈ ఉత్తర్వుల లక్ష్యం. ఈ నిర్ణయాన్ని కేవలం పరిపాలనా మార్పుగా కాకుండా, రెండు దశాబ్దాలుగా ఉన్నత విద్య ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్వయంగా చెప్పుకున్న కారణాల నేపథ్యంలో చూడాలి. ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం మొదటగా ప్రస్తావించింది విజన్ ‘స్వర్ణాంధ్ర @2047’. ఈ డాక్యుమెంట్ ప్రకారం రాష్ట్రాన్ని దీర్ఘకాలంలో జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే మానవ వనరుల నాణ్యతను వేగంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రభుత్వం చెప్పిన మరో కారణం– ఉన్నత విద్య పరిపాలన చిన్న చిన్న విభాగాలుగా ఉండటం, విభిన్న సంస్థల మధ్య అధికారాల అతివ్యాప్తి, ఇందువల్ల ఏర్పడిన బాధ్యతాయుత నాయకత్వ లోపం. ఈ పరిస్థితి వల్ల నిర్ణయాలు ఆలస్యమై, విద్యా సంవత్సరం గందరగోళానికి లోనవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అంగీకరించింది.


ఇంకొక అంశం– ఇప్పటివరకు డిగ్రీ కాలేజీలు ఒక కమిషనరేట్ ఆధీనంలో, ప్రైవేట్ కాలేజీలు మరో నియంత్రణలో, టెక్నికల్ ఎడ్యుకేషన్ మరో విభాగం ఆధీనంలో ఉండటం వల్ల ఒకే విధమైన అకడమిక్ ప్రమాణాల అమలు సాధ్యం కావడం లేదు. అలాగే, టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయంలో ఫైళ్ళు రెండు మూడు విభాగాల మధ్య తిరగడం వల్ల నో–అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఫీజు నిర్ధారణ, అనుబంధ ప్రక్రియలు ఆలస్యం కావడం. ఇవన్నీ కలిపి చూస్తే, ఈ ఉత్తర్వులు యాదృచ్ఛికంగా కాకుండా, ఉన్నత విద్య పాలనలోని వాస్తవ లోపాలకు ప్రతిస్పందనగా తెచ్చినవి.

విశ్వవిద్యాలయాలు నిజంగా జ్ఞానసృష్టి కేంద్రాలుగా మారాలంటే వాటికి అకడమిక్, పరిపాలన, ఆర్థిక అంశాల్లో స్వయంప్రతిపత్తి అవసరం అని జాతీయ విద్యా విధానం–2020 (ఎన్‌ఈపీ) చెబుతోంది. విశ్వవిద్యాలయాల విషయంలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదు. పాలకమండలిలో కూడా విద్యా ప్రమాణాలు సాధించడంలో ప్రత్యేక అనుభవం ఉన్న అధ్యాపకులను, విద్యారంగ నిపుణులను, మేధావులను నియమించాలి. నియంత్రణ అవసరమే కానీ హద్దుల్లో ఉండాలి.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి విద్య, పరిశోధన, కొత్త ఆలోచనలు ఇవన్నీ స్వేచ్ఛాయుత విద్యా వాతావరణం లేకుండా ఎదగలేవు. ఈ కారణంగానే విశ్వవిద్యాలయాలను కేవలం బోధనా సంస్థలుగా కాకుండా, స్వతంత్ర ఆలోచనా కేంద్రాలుగా పెద్దలు భావించారు. అందువల్లనే, విశ్వవిద్యాలయాలకు స్వయంప్రతిపత్తిని కల్పించారు. అక్కడక్కడా చెదురుమదురుగా జరుగుతున్న కొన్ని అసందర్భమైన విషయాలను చూసి మొత్తం విశ్వవిద్యాలయాలన్నింటినీ ఒకే గాటన కట్టకూడదు.


ఈ ఉత్తర్వుల్లో విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి పూర్తిగా రద్దు అవుతుందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. కానీ పరిపాలనా ఏకీకరణ, ఒకే నోడల్ వ్యవస్థ, ఫైల్ రూటింగ్ పెరగడం వంటి పరిణామాలు ఆచరణలో స్వయంప్రతిపత్తిని పూర్తిగా కాగితాలకే పరిమితం చేసే ప్రమాదముంది. ఇలా జరిగితే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో కొత్త కోర్సుల రూపకల్పన, అంతరశాఖా కార్యక్రమాలు ప్రారంభించడం, పరిశోధనా ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వడం వంటి అంశాలు నెమ్మదించే ప్రమాదం కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య ప్రమాణాలపై ఆందోళనలు ఉన్నాయి. దీనిని కాగ్ నివేదికలు, పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యలు, నాణ్యతా భరోసా సంస్థల (NAAC) మార్గదర్శకాలు కూడా సూచిస్తున్నాయి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే చిన్నచిన్న లోపాలు దొర్లినందుకు మొత్తం వ్యవస్థను బలహీనపరచడం సరైన మార్గమా? విధానపరంగా ఇది సమానుపాతం(Proportionality) అనే సూత్రానికి విరుద్ధం.

ఇప్పటి సంస్కరణల చర్చలో మరో కీలకమైన అంశం మానవీయ శాస్త్రాలు, భాషా సాహిత్యాల స్థానం. ఎన్‌ఈపీ స్వయంగా చెబుతున్న విషయం– భారతీయ భాషలు, సాహిత్యం, తత్వశాస్త్రం, కళలు ఒక జాతి సాంస్కృతిక మేధస్సుకు మూలాధారం. కేవలం సాంకేతికత, ఉద్యోగావకాశాలనే ప్రధానంగా చూసి మానవీయ శాస్త్రాలను నిర్లక్ష్యం చేస్తే, సంస్కృతీ వైముఖ్యం, నైతిక పతనం, సామాజిక విభేదాలు దీర్ఘకాలంలో పెరుగుతాయి. అందుకే విశ్వవిద్యాలయాలలో ముఖ్యంగా డిగ్రీ స్థాయిలో, భాషా, సాహిత్యాల కోర్సులను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అనువాద అధ్యయనాలు, సాంస్కృతిక పరిశ్రమలు, మీడియా, వారసత్వ అధ్యయనాలు వంటి అంతరశాఖా రూపాల్లో పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇది విద్యార్థుల నమోదు పెరగడానికి సహాయపడుతుంది.

ఈ ఉత్తర్వులలో మంచి ఉద్దేశాలు ఉన్నాయి. పరిపాలనా గందరగోళాన్ని తగ్గించడం, సమన్వయం పెంచడం, డేటా ఆధారిత పాలనకు దారి చూపడం వంటివి. అదే సమయంలో ప్రమాదాలూ ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు కేవలం అమలు కేంద్రాలుగా మారే అవకాశం, స్నాతకోత్తర స్థాయి కోర్సులు, పరిశోధనలు పరోక్షంగా దెబ్బతినే ప్రమాదం, మానవీయ శాస్త్రాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం వంటివి.


కాబట్టి, ఈ సందర్భంలో ఈ ఉత్తర్వుల అవసరం ఉన్నది కానీ పైన చెప్పిన విషయాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సమతుల్యమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. CHE తన పాత్రను సమన్వయకర్తగా పరిమితం చేయాలి, నెమ్మదిగా విద్యాత్మక నియంతృత్వానికి దారి తీయకూడదు. విశ్వవిద్యాలయాల కోసం స్పష్టమైన ‘‘స్వయం ప్రతిపత్తి చార్టర్’’ ప్రకటించాలి. స్నాతకోత్తర స్థాయి కోర్సులు, పరిశోధనలపై కనీస జోక్యం, గరిష్ఠ రక్షణ విధానం ఉండాలి. మానవీయ శాస్త్రాలు, భాషా సాహిత్యాలకు ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు రూపొందించాలి. అక్రమాలకు లక్షిత పరిష్కారాలు ఇవ్వాలి. వ్యవస్థ మొత్తాన్ని బలహీనపరచకూడదు.

ఈ ఉత్తర్వులు అవసరాల నుంచే పుట్టాయి. కానీ, అవి మన విశ్వవిద్యాలయాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. పరిపాలనా సమర్థత పేరుతో విశ్వవిద్యాలయాల ఆత్మను బలహీనపరిస్తే, తక్షణ సమస్యలు తీరినా దీర్ఘకాలంలో జ్ఞానసృష్టి, పరిశోధన, సంస్కృతి అన్న మూలాలను కోల్పోయే ప్రమాదం ఉంది.

- డాక్టర్ వేలం పళని

తెలుగు శాఖ అధ్యక్షులు, ద్రావిడ విశ్వవిద్యాలయం

Updated Date - Mar 21 , 2026 | 04:01 AM