విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:25 AM
‘భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది’ అని ఆరు దశాబ్దాల క్రితం కొఠారి కమిషన్ తన నివేదికలో పేర్కొంది. సరిగ్గా ఇదే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో...
‘భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది’ అని ఆరు దశాబ్దాల క్రితం కొఠారి కమిషన్ తన నివేదికలో పేర్కొంది. సరిగ్గా ఇదే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు నాణ్యమైన విద్య, వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ, భద్రత, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ డ్రాపౌట్ రేటును తగ్గించే లక్ష్యంతో పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు అన్నిరకాలుగా సహాయం అందిస్తోంది. ఫలితంగా పాఠశాల విద్యలో ఏపీ అమలు చేస్తున్న సంస్కరణలు బాగున్నాయని ఢిల్లీకి చెందిన సమగ్ర శిక్షా అభియాన్ బృందం ప్రశంసించింది. దీని వెనుక విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషి ఎంతో ఉంది.
2014–19లో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంతగా పతనమయ్యిందో అందరికీ తెలిసిందే. 10లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడులు మానేసి ప్రైవేటు బడులకు వెళ్లారు. గత ప్రభుత్వం ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించకపోగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించింది. పతనమైన విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక మెగా డీఎస్సీ ఫైలు పైనే ముఖ్యమంత్రి మొదటి సంతకం చేశారు. ఏడాదిలో మెగా డీఎస్సీ నిర్వహించి 15,941 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని పరిష్కరించడం, ఉపాధ్యాయులకు ఇకపై బోధనేతర బాధ్యతలు ఉండవని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపైనే వారు దృష్టి సారించాలని లోకేశ్ ప్రకటించడం అభినందనీయం. విద్యార్థులు చదువుకు దూరం కాకుండా, ఆర్థిక భారం లేకుండా కూటమి ప్రభుత్వం మన బడి – మన భవిష్యత్తు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేడ్కర్ విదేశీ విద్యానిధి, విద్యా దీవెన, వసతి దీవెన, బాలికా రక్ష, ముస్తాబు, ఉన్నత విద్య చదివే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ వంటి పథకాలు అమలు చేస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాల మెరుగుదలకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, తరగతుల వారీగా ఉపాధ్యాయుల సంఖ్య, ఆర్థిక వనరుల వినియోగం, అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రాథమిక ప్రమాణాలను పరిశీలించేందుకు ‘రాష్ట్ర పాఠశాల ప్రమాణాల నిర్ధారణ కమిటీ’ని ఏర్పాటు చేసింది. సెకండరీ పరీక్షల బోర్డుకు ఈ అధికారాలు కల్పించింది. ఇప్పటివరకు ఎలాంటి సదుపాయాలూ లేకుండా అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన సాగిస్తున్న విద్యాసంస్థలు.. ఇకపై ప్రమాణాలకు అనుగుణంగా మారాలి. లేదంటే వారి అనుబంధ గుర్తింపు జారీపై ప్రభావం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో 117కు ప్రత్యామ్నాయంగా ఈ ఏడాది జూన్ నుంచి రాష్ట్రంలో అయిదు రకాల బడుల విధానం అందుబాటులోకి రానుంది. ఎక్కడా ఒక్క పాఠశాల కూడా మూసివేయకుండా ఈ విధానాన్ని విద్యాశాఖ అమలు చేయనుంది. కొత్తగా ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది. అందుకు స్థానిక ప్రజలు, పాఠశాల యాజమాన్య కమిటీ, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాల ఆధారంగా, క్లస్టర్ స్థాయి కమిటీ సహాయంతో ఆదర్శ పాఠశాలలను విద్యాశాఖ గుర్తిస్తున్నది. 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న బడులు ఉంటే రెండేసి ఆదర్శ బడులను సైతం ఏర్పాటు చేస్తోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 45 మంది ఉన్నా వీటిని తీసుకురానుంది. వీటిల్లో ప్రతీ తరగతికి ఒక టీచర్ చొప్పున కేటాయించనుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 12 వేలకు పైగా ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయి. ఇక్కడ 18 సబ్జెక్టులను ఒక్కరే బోధించాల్సి వస్తోంది. దీంతో ప్రాథమిక స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో తరగతికి ఒక టీచర్ ఉండే ఆదర్శ బడుల విధానం పిల్లలకు కచ్చితంగా మేలు చేస్తుంది. తరగతిలో 40 మంది విద్యార్థులు ఉంటే అభ్యసన సామర్థ్యాలతో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉంటారు. అందరికీ ఒకేలా కాకుండా వారి స్థాయిని అనుసరించి బోధన అందించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ చర్యలు చేపట్టింది. ఇందుకోసం పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్‌ను అమలు చేయనుంది. ఈ విధానంలో కృత్రిమ మేధ (ఏఐ) విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసి, దానికి అనుగుణంగా వీడియో పాఠాలు ప్రసారం చేస్తుంది. దీంతో చదువులో వెనుకబడిన విద్యార్థులకు సైతం ఆయా పాఠాలు సులభంగా అర్థమవుతాయి. కూటమి ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు మెగా పేరెంట్స్ మీటింగ్స్ నిర్వహిస్తుంది. ఈ సమావేశాలలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్‌లు, పిల్లల ప్రవర్తన, మౌలిక సదుపాయాలు, విద్యార్థులతో కలిసి భోజనం వంటి అంశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, అభ్యసనతో పాటు వారి సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తోంది. విద్యాశాఖ మంత్రి లోకేశ్ చొరవతో దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా కేంద్రం నుంచి 935 పీఎంశ్రీ పాఠశాలలను మన రాష్ట్రం సాధించింది. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేపడుతూనే ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం రూ.4,064 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టింది. కూటమి ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరానికి గాను బకాయిలు ఉన్న రూ.1,198 కోట్లు విడుదల చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన’ కింద ఉద్యోగాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో శిక్షణలో మూడో స్థానంలో ఉన్న ఏపీ, నియామకాల్లో మొదటి స్థానంలో ఉంది. గత ఏడాది 13,778 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వగా 10,699 మందికి ఉద్యోగాలు లభించాయి. బీటెక్, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్యం పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇందులో రెజ్యుమె తయారు చేసుకుంటే అర్హతల ఆధారంగా ఉద్యోగావకాశాలు కనిపిస్తాయి.
అందరూ ఎదిగేందుకు కీలకమైన విద్య విషయంలో కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తోంది. కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి మనమందరం చేతులు కలపాలి.
కూసంపూడి శ్రీనివాస్
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
ఇవి కూడా చదవండి..
ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..