Share News

కోకో రైతుకు భరోసానివ్వాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:39 AM

ప్రస్తుతం దేశంలోని కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, అందులో మెజారిటీ వాటా గోదావరి జిల్లాలదే. ఈ నేపథ్యంలోనే ఏలూరు ప్రాంతాన్ని ‘కోకో సిటీ’గా...

కోకో రైతుకు భరోసానివ్వాలి

ప్రస్తుతం దేశంలోని కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, అందులో మెజారిటీ వాటా గోదావరి జిల్లాలదే. ఈ నేపథ్యంలోనే ఏలూరు ప్రాంతాన్ని ‘కోకో సిటీ’గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. చాక్లెట్, ఇతర పానీయాల పరిశ్రమలకు అవసరమైన ముడిపదార్థం కోకో. సాధారణంగా అగ్రి–బిజినెస్ కంపెనీలు కచ్చితమైన మార్కెట్‌ను కల్పించి, ఒప్పంద వ్యవసాయం (కాంట్రాక్ట్‌ ఫార్మింగ్) ద్వారా ఇలాంటి వాణిజ్య పంటలను సాగు చేయిస్తాయి. కానీ, గోదావరి జిల్లాల్లో కోకో సాగు విషయానికి వస్తే కార్పొరేట్ సంస్థలతో రైతులకు ఎలాంటి రాతపూర్వక ఒప్పందాలు లేవు. కోకోను రైతు సాగుచేయడం, మార్కెట్‌లో విక్రయించడం అనేది పూర్తిగా కంపెనీల ‘నమ్మకం’ మీదనే ఆధారపడి జరుగుతోంది.

కంపెనీలు రైతులకు ధరపై ఎలాంటి హామీలూ ఇవ్వడం లేదు. కొనుగోలు బాధ్యతను కూడా తీసుకోవడం లేదు. అలాగని వరి వంటి ఆహార పంటల లాగా ఇది ‘కార్పొరేట్ నియంత్రణ లేని సాగు’ అని కూడా చెప్పలేం. వాస్తవానికి రాష్ట్రంలో కొన్నేళ్లుగా అనేక వాణిజ్య పంటలు ఇలాగే ఒప్పందాలు లేకుండానే సాగవుతున్నాయి. ఇది వ్యవసాయ రంగాన్ని ఒక అనిశ్చితమైన కార్పొరేట్ వ్యవసాయం దిశగా తీసుకెళ్తోంది.

ప్రస్తుతం కోకోను అంతర పంటగా, అదనపు ఆదాయం ఇచ్చే వనరుగా చూస్తున్నాం. కానీ, వాస్తవానికి ఇది దీర్ఘకాలిక పంట. సాగు వ్యయం తక్కువగా అనిపించినా శ్రమ, సమయం... వంటివన్నీ రైతులే భరించాలి. వాణిజ్య పంటలను రైతు గానీ, వినియోగదారుడు గానీ నేరుగా ఉపయోగించుకోలేరు. కొన్ని పంటలకు స్థానిక మార్కెట్ ఉన్నా, కోకో వంటి పంటలకు ప్రాసెసింగ్ పరిశ్రమలే దిక్కు. ఏదో ఒక పెద్ద కంపెనీ తమ పంటను కొనుగోలు చేస్తుందనే నమ్మకంతోనే రైతులు దీనిని సాగు చేస్తున్నారు. కాబట్టి సదరు కంపెనీ ఎన్ని షరతులు విధించినా రైతు అంగీకరించక తప్పదు. ఇది రైతుకు స్వేచ్ఛా మార్కెట్ కాదు, ‘తప్పనిసరి మార్కెట్’.


గతంలో ఆయిల్ పామ్, కీర దోసకాయ వంటి పంటల్లో ఒప్పంద వ్యవసాయం కొంతవరకు సానుకూల ఫలితాలనిచ్చింది. విత్తనాలు, మందుల పంపిణీ, సాంకేతిక సహాయంతో పాటు కచ్చితమైన కొనుగోలు హామీలు ఉండేవి. కానీ గత దశాబ్ద కాలంగా క్లస్టర్ వ్యవసాయం, హబ్‌లు, వివిధ రకాల వ్యవసాయ మార్కెట్ చట్టాల సవరణల పేరుతో ఈ ఒప్పంద వ్యవసాయ విధానం క్రమంగా నీరుగారింది. వాణిజ్య పంటల విషయంలో రైతు పూర్తిగా కార్పొరేట్ కంపెనీలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయంలో ఒప్పందాలే లేనందున పంటకు ధరల చర్చలు, కొనుగోలు బాధ్యతలు, చట్టపరమైన హామీలు అనే మాటకే తావులేకుండా పోయింది.

ప్రభుత్వం వ్యవసాయం, రైతు అభివృద్ధి పేరుతో మొక్కల పంపిణీ, సబ్సిడీలు, వ్యవసాయ సేవలు అందించడం, హబ్‌లు, క్లస్టర్లు ఏర్పాటు చేయడం లాంటి అభివృద్ధి నినాదాలు ఇస్తోంది. కానీ, వాణిజ్య పంటల అమ్మకాల విషయంలో రైతుకు ధర హామీ ఇచ్చేది ఎవరు? కొనుగోలు బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో కోకో లాంటి ఆధునిక వాణిజ్య పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి. మార్కెట్ ఆధారిత వ్యవసాయంలో రైతు హక్కులు, ఆదాయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. విధివిధానాల్లో స్పష్టతనిస్తూ, మార్కెట్ భరోసా కల్పించే చర్యలు చేపట్టాలి.

డా. చిన్నరంగయ్య దండు

ఇవి కూడా చదవండి..

ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..

మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 17 , 2026 | 01:39 AM