Share News

...అందుకే, మండలికి పంపలేదు!

ABN , Publish Date - Apr 02 , 2026 | 05:16 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని కేవలం అమరావతిలోనే ఉండే విధంగా కేంద్రం గతంలో చేసిన రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ...

...అందుకే, మండలికి పంపలేదు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని కేవలం అమరావతిలోనే ఉండే విధంగా కేంద్రం గతంలో చేసిన రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే, ఇదే తీర్మానాన్ని శాసనమండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదు అంటూ వైసీపీ నోరేసుకుని పడిపోతున్నది. ఆ పార్టీ ఆవేదన విన్నవాళ్లు, చూసిన వాళ్ళు ‘ప్రజాస్వామ్యం’పైనా, చట్టసభల పైనా వైసీపీకి ఎంత గౌరవమో గదప్పా అంటూ ముచ్చట పడిపోవడం కూడా కద్దు.

శాసనసభ ఆమోదించినది కేవలం తీర్మానమే. బిల్లు కాదు. తీర్మానాలు కౌన్సిల్‌కి పంపాల్సిన పని లేదని రాజ్యాంగం చెబుతున్నది. చట్టం చేయడానికి ఉద్దేశించిన బిల్లులను, ఆర్థిక బిల్లులను మాత్రం పంపితే సరిపోతుంది. వాటిపై, కౌన్సిల్ వ్యక్తం చేసే అభిప్రాయం శాసనసభపై బైండింగ్ కాదు. జస్ట్, సలహా మాత్రమే. ఇక, ప్రస్తుత తీర్మానం కేంద్రానికి ఒక సిఫారసు. దానిని కేంద్రం ఆమోదించనూవచ్చు, తిరస్కరించనూ వచ్చు. ఉదాహరణకు– శాసనమండలి శుద్ధ దండుగ అని, ఏడాదికి రూ.60 కోట్ల సొమ్ము వృథా అని దానిని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ గత వైసీపీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపింది. అప్పటి మండలిలో వైసీపీకి మెజారిటీ లేకపోవడంతో జగన్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఇక్కడ 151 మంది శాసనసభ్యుల కంటే ‘వాళ్లకు’ ఎక్కువ తెలుసా అంటూ ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. జగన్ ప్రభుత్వం పంపిన ఆ తీర్మానాన్ని కేంద్రం బుట్టదాఖలు చేసింది. జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చురుకుగా, ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నంత కాలం... ‘రాజధాని అమరావతి’ కాన్సెప్ట్‌కు ముప్పు పొంచి ఉన్నట్టే. అందువల్ల, ఎందుకైనా మంచిదన్న భావనతో ఈ తీర్మానం చేసి ఉంటారు. ప్రస్తుత అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ఈ తీర్మానాన్ని శాసన మండలికి ఎందుకు రిఫర్ చేయలేదంటూ వైసీపీ నాయకులు, ప్రచార సాధనాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. పేర్ని నానిని అడ్డం పెట్టుకుంటున్న వైసీపీ (ఇందులో కాపు అనే యాంగిల్ కూడా ఉంది) మండలిలో ఈ తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదని అదేదో పెద్ద ‘లా పాయింట్’ పట్టుకున్న దానిలా కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నది. ఎందుకు మండలిలో ప్రవేశపెట్టలేదో వైసీపీకి కూడా తెలుసు.


శాసనసభ, శాసన మండలికి ఒకే రకమైన స్థాయి, హోదా లేవు. శాసనసభ మొత్తం రాష్ట్ర జనాభా నుంచి నేరుగా ఎన్నికైన ప్రతినిధుల సభ. శాసనసభ సభ్యుల సంఖ్యలో మూడో వంతుకు మించకుండా సభ్యులను ఎంపిక చేసి ఏర్పాటు చేసిందే శాసనమండలి. వివిధ మార్గాల ద్వారా ఈ సభలో సభ్యులు అడుగు పెడతారు తప్ప, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండవు. శాసనసభ్యులకు రాజ్యాంగ రీత్యా సంక్రమించే చాలా రకాల అధికారాలు, బాధ్యతలు కౌన్సిల్ సభ్యులకు ఉండవు.

175 మంది సభ్యులు గల శాసనసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అందుకే శాసనసభకు రాలేకపోతున్నారు. సభకు మొహాలు చూపించలేకపోతున్నారు. వాళ్ళ ఆత్మలకు తెలుసు కదా, వారి హయాంలో నడిచిన శాసనసభ సమావేశాల్లో వారు ఎలా వ్యవహరించారో! కానీ, శాసనమండలిలో సభ్యులు మొత్తం 58 మందే. అందులో పది పన్నెండు మందికి పైబడి వైసీపీ సభ్యులు ఉన్నారు. మండలి చైర్మన్ కూడా తమ అభ్యర్థే అనేది వైసీపీ ధీమా. అందువల్ల అల్లరి చేయడానికి, తీర్మానాన్ని అడ్డుకోడానికి, బోలెడంత ఫ్రీ పబ్లిసిటీతో పొలిటికల్ మైలేజ్‌కు అవకాశం ఉంటుందనేది వైసీపీ అంచనా. ఆ అవకాశం మిస్సయినందుకు తెగ బాధపడిపోతున్నారు. అదీ విషయం!

భోగాది వేంకటరాయుడు

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ

ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్

Updated Date - Apr 02 , 2026 | 05:16 AM