Share News

అన్నల రాజ్యం అంతమయ్యేనా?‍

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:26 AM

భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం అని ప్రకటన చేయడం దేశంలోనే పెద్ద చర్చకు దారి తీసింది. దీనికి తోడు ఆపరేషన్‌ కగార్‌ను పరిశీలిస్తే ప్రధాన నాయకులతో పాటు కిందిస్థాయి నక్సలైట్లు అనేక మంది ఆయుధాలతో లొంగిపోతున్నారు.

అన్నల రాజ్యం అంతమయ్యేనా?‍

భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం అని ప్రకటన చేయడం దేశంలోనే పెద్ద చర్చకు దారి తీసింది. దీనికి తోడు ఆపరేషన్‌ కగార్‌ను పరిశీలిస్తే ప్రధాన నాయకులతో పాటు కిందిస్థాయి నక్సలైట్లు అనేక మంది ఆయుధాలతో లొంగిపోతున్నారు. కేవలం అతికొద్ది శాతం నక్సలైట్లు మిగిలి ఉన్నారు.

అయితే ప్రారంభంలో.. పేద ప్రజల సమస్యలపై పోరాడుతారని నక్సలైట్లను ప్రజలు ‘అన్న’లుగా భావించారు. రానురాను ప్రజల మనోభావాలను గ్రహించకుండా పనిచేయడం, ప్రజలపై హింస, బెదిరింపులు పెరగడంతో వారు నక్సలైట్లను తిరస్కరించడం ప్రారంభించారు. ఒక రకంగా ఈ హింస ప్రజల్లో గందరగోళాన్ని, భయాన్ని కలిగించింది. ప్రజల సమస్యలను శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించకుండా, హింసను ఎంచుకోవడం నక్సలైట్లకు పెద్ద అపజయంగా మారింది. ప్రపంచంలో పోటీతత్వం పెరిగి అభివృద్ధి దిశలో దేశాలు పయనిస్తుంటే నక్సల్స్‌ ప్రభావం ఉన్న పాంతాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దానివల్ల పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. దీనివల్ల అనేక మంది ప్రజలు నష్టపోయారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గిరిజన, ఎస్సీ–ఎస్టీ సమస్యల నేపథ్యంలో నక్సలిజం ప్రారంభమైందని చెబుతున్నప్పటికీ, దీర్ఘకాలంలో గిరిజనులు ఎక్కువగా నష్టపోయారని ఇంటర్నల్‌ సెక్యూరిటీ స్టడీస్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌, హోంశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ రిపోర్టులు చెబుతున్నాయి. హింస, అభివృద్ధి లోపం, స్థలాంతరం వంటి సమస్యలు దళితుల జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.


గత రెండు దశాబ్దాలుగా భారత ప్రభుత్వం నక్సలిజాన్ని ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని అమలుచేస్తూ వస్తోంది. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం వల్ల నక్సలిజం మూలాలను అంతం చేయడానికి పూనుకుంది. ఫలితంగా నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రజలు తమ సమస్యలను ఎన్నికల ద్వారా, చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని పొందుతున్నారు. విద్య, అభివృద్ధిపై అవగాహన పెరగడంతో ప్రజలు కూడా ప్రజాస్వామ్య మార్గాన్ని ఎక్కువగా నమ్మడం ప్రారంభించారు. సాయుధ పోరాటం కంటే ప్రజాస్వామ్య వ్యవస్థ శాశ్వత పరిష్కారం అని ప్రజలు గ్రహించారు. అందుకే నక్సలైట్లు ప్రజల నుంచి ఆదరణ పొందలేకపోయారు. ప్రజల మద్దతు లేకుండా ఏ ఉద్యమం కొనసాగలేదని చరిత్ర చెబుతోంది.

ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్య బేషరతుగా తుపాకులను వదిలి నక్సలైట్లు లొంగిపోవడం హర్షించదగ్గ విషయం. గ్రామాలు మారుతున్నాయి, యువత కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తోంది. అందుకే ఒకప్పటి ‘అన్నల రాజ్యం’ ఇప్పుడు క్రమంగా అంతమవుతున్న ఒక అధ్యాయంగా మిగిలిపోతోంది. ఆయుధాలు లేకుండా లొంగిపోయిన నక్సలైట్లు చేస్తున్న నూతన ప్రయోగాలను ప్రజలు విశ్వసిస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

– పూసాల మోహన్‌చారి

Updated Date - Mar 31 , 2026 | 01:28 AM