Share News

అమరావతి గ్రహణం వీడింది!

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:19 AM

అమరావతి అంటే ఒక నగరం కాదు; ఒక శక్తి, ఒక పుణ్యభూమి, ఓ సంప్రదాయం, పురోగతికి నిదర్శనం. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, వికసిత్ భారత్‌కు బలమైన పునాదిగా నిలవబోతున్నది.

అమరావతి గ్రహణం వీడింది!

అమరావతి అంటే ఒక నగరం కాదు; ఒక శక్తి, ఒక పుణ్యభూమి, ఓ సంప్రదాయం, పురోగతికి నిదర్శనం. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, వికసిత్ భారత్‌కు బలమైన పునాదిగా నిలవబోతున్నది. ప్రతి వ్యక్తి కల అయిన అమరావతి రాజధాని నిర్మాణం ఎట్టకేలకు సాకారమవుతున్నది. రాష్ట్ర ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు, వారి సంకల్పానికి, ఆంకాంక్షలకు నిదర్శనమే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు. అమరావతి రైతులు చేసిన అమూల్యమైన త్యాగం, వారి పట్టుదల, నమ్మకాలే రాజధాని కలను నేటి వరకూ సజీవంగా ఉంచాయనడంలో సందేహం లేదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రపంచంలోనే అమరావతి ఒక అద్వితీయమైన నగరంగా నిలిచే మంచి రోజులు త్వరలోనే సాకారం కానున్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబునాయుడి సారథ్యంలో అమరావతి ఇక శాశ్వతమన్న ధీమా ప్రతి ఒక్క తెలుగువాడిలో స్పష్టంగా కనిపిస్తున్నది. అమరావతి కేవలం రాజధాని కాదు. ఇది తెలుగుతల్లి ఆత్మ. ఇది కేవలం ఒక్క నగరం కాదు. ఐదు కోట్లమంది గుండె చప్పుడు. రైతుల త్యాగాలకు దక్కిన అసలైన విజయం ఇది. విభజన కష్టాల నుంచి గట్టెక్కి నవ్యాంధ్ర నిర్మాణంలో అమరావతి ఇక అజరామరంగా నిలిచిపోనున్నది. కేంద్రం వేసిన ఈ రాజముద్రతో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా లభించింది. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్రను లిఖించబోతోంది.


తెలుగు జాతి ప్రయోజనాల కోసం, సంపద సృష్టికోసం ఆనాడు సైబరాబాద్‌ను నిర్మించిన చంద్రబాబు నాయుడు మనకంటూ ఓ రాజధాని ఉండాలని సంకల్పించిన ఫలితమే అమరావతి. దేశంలో ఒక్క విషయంలో కూడా ఏకం కాని పక్షాలు.. ఒకే మాట మాట్లాడిన అంశం ఏదైనా ఉందంటే అది రాజధాని అమరావతే. సిద్ధాంతాలు వేరు, దారులు వేరు, ఆశలు వేరు, ఆశయాలు వేరు; కానీ దేశ ప్రయోజనాల ముందు అన్ని రాజకీయ పార్టీలు ఒకే దారిని ఎంచుకున్నాయి. కలిసి మద్దతునిచ్చాయి. ఇది చంద్రబాబు రాజకీయ చాణక్యానికి తార్కాణం. నాటి శాతకర్ణి భారతాన్ని ఏకం చేసిన చక్రవర్తి. ఇదే భారత ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయపక్షాల మద్దతు కూడగట్టడంలో సఫలీకృతమైన నేటి చక్రవర్తి చంద్రబాబు. అమరావతిలో ఆరిన స్వప్నాన్ని మళ్ళీ వెలిగించిన ఏకైక నాయకుడు ఆయన. ఇది కేవలం రాజధాని బిల్లు అనుకుంటే పొరపాటే! ఇది చరిత్రకు చట్టసభల ప్రజాప్రతినిధులు వేసిన రాజముద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో వచ్చిన గాయం అమరావతితోనే మానడం ఖాయం.

- వాసంశెట్టి సుభాష్

కార్మికశాఖ మంత్రి

Updated Date - Apr 15 , 2026 | 04:20 AM