అమరావతి... నిజమైంది!
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:07 AM
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కావాలని పట్టుపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం నెరవేరింది. లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది....
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కావాలని పట్టుపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం నెరవేరింది. లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. రాజ్యసభలోనూ ఆమోదముద్ర వేయించుకుని, రాష్ట్రపతి ముద్ర పడటమే తరువాయి. ప్రతిపక్ష వైసీపీ ప్రజల ఈ కల నెరవేరకుండా మోకాలడ్డుతూ ఆడిన మూడుముక్కలాట ముగిసింది. దేవతల రాజధాని అమరావతి పేరు పెట్టడం వల్ల అది భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా, ప్రజాహృదయాలలో చెరగని ముద్ర అయింది. రైతులు ముప్పైమూడు వేల ఎకరాలను ప్రజల రాజధాని కోసం ఇవ్వడం ముదావహం. అలాగే వారు అమరావతి కోసం చేసిన దీక్షలు, యాత్రలు, భరించిన కష్టనష్టాలు స్ఫూర్తిదాయకమైనవి. ప్రతిపక్ష నేతలు ఎంతగా విమర్శించినా పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు అడుగు ముందుకు వేసి విజయం సాధించారు. అభినందనలను అందుకున్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు. పంతం నెగ్గిన మాత్రాన పని అయిపోదు. మరింత బాధ్యతతో రాజధాని నగరాన్ని తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం సహకరించి, చిత్తశుద్ధితో శ్రమించినప్పుడే అమరావతి భాగ్యనగరానికి దీటుగా రూపుదిద్దుకోగలుగుతుంది. అమరావతి అంటే గిట్టనివారు ఇప్పటికయినా అహం వీడాలి. అందరూ కలిసి అమరావతిని అద్భుత రాజధానిగా మలచుకోవాలి.
ఉప్పు రాఘవేంద్రరావు
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ
ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్