తొంభై ఏళ్ళ తరంగ రథం!
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:07 AM
సమాజ హితానికి, మానసిక సుఖానికి అలవరుసలపై అలరించే ఆవిష్కరణ రేడియో. భాషా భావాలు పెనవేసుకున్న మాటల పాటల పేటిక! కంటికి కనిపించని రూపమై, వినిపించే శబ్ద తరంగమై మనతో సాగే అపురూప నేస్తం!
సమాజ హితానికి, మానసిక సుఖానికి అలవరుసలపై అలరించే ఆవిష్కరణ రేడియో. భాషా భావాలు పెనవేసుకున్న మాటల పాటల పేటిక! కంటికి కనిపించని రూపమై, వినిపించే శబ్ద తరంగమై మనతో సాగే అపురూప నేస్తం! రేడియో కేవలం శబ్ద ప్రసార యంత్ర వ్యవస్థ కాదు! అదృశ్య శ్రోతతో మానవ సంబంధాన్ని నిర్మించే ఒక అద్భుత శబ్ద సంస్కృతి!
శ్రోతల చెవుల నుంచి ఊహల ఊసులలో ఆడుకునే అందమైన తోరణాలు రేడియో కార్యక్రమాలు. సృజనాత్మక వ్యక్తీకరణ కళను, అంతరంగిక అనుభూతి ఆధ్యాత్మికతను, విజ్ఞానం ప్రసాదించే అవగాహనను, ఈ మూడింటిని ఒకేసారి అందిస్తుంది కనుకనే, ప్రపంచ ప్రజలందరి జీవితాల్లో రేడియో ఒక ముఖ్యమైన భాగం!
1936 జూన్ 8న ‘ఇండియన్ స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్’ అనే పేరు ‘ఆల్ ఇండియా రేడియో’ (AIR)గా రూపాంతరం చెంది నేటికి తొంభై ఏళ్ళు! మరో పదేళ్లలో ‘శత వసంత సీమకు’ పరుగులు పెడుతోంది!
టెక్నాలజీ శబ్దాన్ని ఇస్తుంది, కళ భావాన్ని ఇస్తుంది, తత్వం సంబంధాన్ని ఇస్తుంది– ఈ మూడూ కలిసినప్పుడే నిజమైన ‘ప్రసారం’ పుడుతుంది! ఆకాశవాణి ‘‘అలవరుసలు’’ అంటే– శబ్దం, స్వరం, భావం, మౌనం, జ్ఞాపకం, మానవ సంబంధం వీటన్నింటి మధ్య సాగే ఒక నిరంతర అలల క్రమం! అందుకే ఆకాశవాణిలో చివరకు నిలిచేది ‘శబ్దం’ కాదు, ఒక మనిషి మనకు అత్యంత దగ్గరగా ఉన్నాడనే అపురూప ‘అనుభూతి’!
ఆకాశవాణిలో వార్తా వ్యాఖ్యానం, ప్రసంగం, ప్రకటన, సంభాషణ, ప్రశ్నోత్తరం, రూపకం, నాటకం... ఇలా ఎన్నో ప్రక్రియలు రసవత్తరంగా సాగుతాయి! ఆ శబ్ద శ్రవణంలోని మాధుర్యం మదినిండా మధుర భావాన్ని నింపుతుంది! శబ్ద రవళుల రసధునియై, భావ సాగరంలో సుశ్రావ్య ధ్వనియై.. ఎప్పుడైనా, ఎక్కడైనా నిరంతరం ఆలకింపజేస్తుంది! ఒక నూతన రాగంగా, తరం తరం పరంపరగా అలరించే ఈ గళ మధురిమ, వినువీధిలో సాగుతూ మన వీనులను స్పృశిస్తుంది!
విజ్ఞాన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలే కాక, ట్రాఫిక్, క్రీడలు, వాతావరణం, వినియోగదారుల సమాచారం.. ఇలా అన్నీ ఒకేచోట లభిస్తాయి! ఇవేగాక సంగీత ప్రసారంలో శాస్త్రీయ, లలిత, జానపద, చలనచిత్ర సంగీతాలు... ఒక్కోదానిదీ ఒక్కో ప్రత్యేక శైలి! మొత్తంగా చూస్తే ప్రతి విషయ సమూహాన్ని తనలో ఇముడ్చుకున్న ఒక అద్భుత ‘వైవిధ్య కదంబం’ మన రేడియో!
‘సమాచారం – విద్య – వినోదం’ – ఈ మూడే రేడియో పరమార్థాలు! ఒకే సమయంలో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించాలి, జ్ఞానాన్ని పెంపొందిస్తూ విద్యావంతులను చేయాలి, మనసుకు హాయినిచ్చే ఆహ్లాదాన్ని కలిగించాలి! ఈ త్రివిధ బాధ్యతను నిరంతరం నెరవేర్చేదే నిజమైన రేడియో!
ఇక్కడ సంగీత ప్రసారానిదీ ఒక ప్రత్యేక స్థానం! శాస్త్రీయ సంగీతం నుండి జానపద గీతాల వరకు, లలిత సంగీతం నుండి చలనచిత్ర గీతాల వరకు రేడియో సంగీతాన్ని కేవలం వినిపించలేదు; తరాల మధ్య ఒక అపురూప ‘సాంస్కృతిక స్మృతిగా’ నిలిపింది!
రేడియోలో ‘ఉచ్చారణ, విరామం, మృదుత్వం, ఆహ్వానం’ ఇవి కేవలం వాచిక నైపుణ్యాలు మాత్రమే కాదు; అదృశ్య శ్రోతతో ఆత్మీయ బంధాన్ని నిర్మించే అపురూప ‘మానవ వంతెనలు’! ఒక వ్యాఖ్యాత స్వరంలో ఉండే ఆప్యాయత, సాన్నిహిత్యం రేడియోను శ్రోతకు అత్యంత దగ్గర చేస్తుంది! శ్రోత ఆ వ్యాఖ్యాత ముఖాన్ని చూడకపోయినా, ఆ స్వరంలోని మానసిక స్థితిని సులువుగా గ్రహిస్తాడు! కొంతకాలానికి ఆ గొంతు జీవితంలోని ఒక జ్ఞాపకంతో, ఒక అనుభూతితో, ఒక సమయంతో కలగలిసిపోతుంది! చివరకు ఆ వ్యాఖ్యాత శ్రోతకు ఒక కుటుంబ సభ్యుడిలా అనిపిస్తాడు! అప్పుడు రేడియో వినికిడి కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక అపురూప సాహచర్యం!
సమాచారాన్ని మనిషి కేవలం విషయంగా మాత్రమే కాదు, దాన్ని మోసుకొచ్చిన ‘స్వరంతో’ కూడా స్వీకరిస్తాడు! మాట అనేది ఒక ఆదేశంలా, ఆవేశంతో కాదు, భాగస్వామ్యానికి ఇచ్చే పిలుపులా మృదువుగా ఉండాలి! అది శ్రోతకు కేవలం చదివి వినిపించడం కాదు, శ్రోతతో ఆత్మీయంగా మాట్లాడి, వినేలా చేయడం! మైక్రోఫోన్ ముందు మాట్లాడే వ్యక్తి స్వరం మాత్రమే కాదు, అతని సంస్కారవంతమైన ‘వ్యక్తిత్వం’ కూడా రేడియోలో ప్రసారమవుతుంది! అందుకే ధ్వని క్రమశిక్షణ, భాషా మర్యాద, సమయస్పృహ, శ్రోత పట్ల గౌరవం వంటి అంశాలు రేడియోలో అత్యంత ముఖ్యమైనవి! అక్షరం రానివారికైనా ఆ స్వరమే భాషై, అక్షరమై తరంగ రథంపై మాటల పాటల రెక్కలు విప్పుకొని, ఒక మధుర భావనగా తేలివస్తుంది! చెవికి గిలిగింతలు పెడుతూ శ్రోతల హృదయాంతరాళంలో చెరిపివేయలేని శబ్ద ముద్రలు వేస్తుంది!
శబ్దం నుండి అనుభూతి వరకు, స్వరం నుండి సంబంధం వరకు, అల నుండి జ్ఞాపకం వరకు, రేడియో నుండి మానవ సాన్నిహిత్యం వరకు సాగిన ఒక అపురూప సమాహారం మన ఆకాశవాణి! అల వరుసలపై తేలియాడి మదినిండా మధుర ఊహలను నింపే ఆకాశవాణిని అప్పుడు విన్నాం, ఇప్పుడు వింటున్నాం, ఎప్పుడూ వింటూనే ఉందాం!
- చంద్రశేఖర్ మల్లాది
(జూన్ 8: ఆకాశవాణికి 90 వసంతాలు)