ఏఐ నియంత్రణలో కొత్త దిశ!
ABN , Publish Date - Apr 04 , 2026 | 02:36 AM
నేటి ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) మనిషి జీవన విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్న శక్తిగా ఎదిగింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ రూపొందించిన ఏఐ నియంత్రణ విధానం (ఏఐ యాక్ట్) అంతర్జాతీయ స్థాయిలో ఒక మైలురాయి.
నేటి ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) మనిషి జీవన విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్న శక్తిగా ఎదిగింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ రూపొందించిన ఏఐ నియంత్రణ విధానం (ఏఐ యాక్ట్) అంతర్జాతీయ స్థాయిలో ఒక మైలురాయి. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి వేగం పెరిగినా, దాని దుష్ప్రభావాలపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. డీప్‌ఫేక్‌లు, డేటా గోప్యత సమస్యలు, అల్గోరిథమ్ పక్షపాతం వంటి అంశాలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉదాహరణకు చాట్‌జీపీటీ, గూగుల్, జెమిని వంటి ఆధునిక ఏఐ టూల్స్ వేగంగా ప్రజల జీవితాల్లోకి వచ్చాయి. కానీ వీటి వినియోగంపై సరైన నియంత్రణ లేకపోతే, తప్పుదోవ పట్టించే సమాచారం విస్తరించే ప్రమాదం ఉంది. యూరప్ ప్రతిపాదించిన ఏఐ చట్టం.. వ్యవస్థలను రిస్క్ ఆధారంగా వర్గీకరిస్తుంది. అవి– ఆరోగ్యం, విద్య, న్యాయ వ్యవస్థ వంటి అధిక రిస్క్ ఉన్న కీలక రంగాల్లో ఉపయోగించే ఏఐపై కఠిన నియంత్రణ; పరిమిత రిస్క్ కలిగి, సాధారణ వినియోగంలో ఉన్న ఏఐకు పారదర్శకత నిబంధనలు; సాధారణ రిస్క్ కలిగిన అప్లికేషన్లకు తక్కువ నియంత్రణ. ఇది ఒక విధంగా టెక్నాలజీ అభివృద్ధిని అడ్డుకోకుండా, దాని వినియోగాన్ని బాధ్యతాయుతంగా మార్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఏఐ రంగంలో ముందంజలో ఉన్న కంపెనీలు ఈ నియంత్రణలపై జాగ్రత్తగా స్పందిస్తున్నాయి. యూరప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర దేశాలకు కూడా మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాలు ఏఐ విధానాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారతదేశం కూడా ఈ మార్పులను గమనిస్తూ, ఒక సమగ్ర చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
– ఎల్లబోయిన వెంకటేశ్వర్లు