ఆశ గొలుపుతూ భయపెడుతున్న ఏఐ
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:49 AM
నవ నవీన సాంకేతికత కృత్రిమ మేధ మన జీవితాలలోకి ప్రవేశించింది. ఇది మానవ సామర్థ్యాలను, ఉత్పాదకతను ఇతోధికంగా (ఇది చాలా చిన్న విశేషణమే) పెంపొందిస్తోందన్న మాట ఎటువంటి మినహాయింపూ లేని నిజం.
నవ నవీన సాంకేతికత కృత్రిమ మేధ మన జీవితాలలోకి ప్రవేశించింది. ఇది మానవ సామర్థ్యాలను, ఉత్పాదకతను ఇతోధికంగా (ఇది చాలా చిన్న విశేషణమే) పెంపొందిస్తోందన్న మాట ఎటువంటి మినహాయింపూ లేని నిజం.
భారత్‌కు మానవ వనరులు అపారంగా ఉన్నాయి. కనీసం 2050 సంవత్సరం దాకా ఇవి అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి. అయితే మన మానవ వనరుల నాణ్యత, అభివృద్ధి చెందిన దేశాలలోని మానవ వనరుల నాణ్యతకు భిన్నమైనది. అభివృద్ధి చెందిన ప్రతి దేశంలోనూ ప్రతి ఒక్కరూ పాఠశాల విద్య పూర్తి చేసినవారై ఉంటారు. వారిలో అత్యధికులు కళాశాల విద్యాభ్యాసాన్ని కూడా తప్పక పూర్తి చేస్తారు. జీవిత పర్యంతం చదువుకునే, కొత్త నైపుణ్యాలను సమకూర్చుకునే అవకాశాలు అభివృద్ధి చెందిన దేశాలలో పుష్కలంగా ఉన్నాయి. మన దేశంలో జనాభా లబ్ధి (పనిచేసే వయసుగల వారి సంఖ్య అత్యధికంగా ఉండడం)తో జనాభా భారాలు అనివార్యమవుతున్నాయి. పని చేయగల వారికి ఉపాధి లభించకపోతే వారు దేశానికి భారమవడంతో పాటు సామాజిక అశాంతి ప్రబలిపోయి జనాభా లబ్ధి జనాభా విపత్తుగా పరిణమించే ప్రమాదమూ ఉన్నది. ప్రాథమిక విద్య స్థాయిలో బడుల్లో చేరేవారి సంఖ్య అత్యధికంగా ఉన్నప్పటికీ ప్రాథమికోన్నత, మాధ్యమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్న వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఉన్నత విద్య స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి 40 నుంచి 50శాతంగా ఉంటోంది. కళాశాల విద్యార్థుల్లో చాలా మంది అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సముపార్జించుకుంటున్నారు. అయితే ఆ అర్హతతో వారికి ఎటువంటి ‘నైపుణ్యాలు’ సమకూరడం లేదు, ‘ఉద్యోగ నియామకాల’కు అర్హులూ కాలేకపోతున్నారు. అసంఖ్యాక యువతీ యువకులకు సరైన ఉద్యోగం లభించకపోవడానికి ప్రధాన కారణం– వారు నైపుణ్యాలు, ఇతర అర్హతలు కొరవడినవారు కావడమే. ఇది ఎవరూ కొట్టివేయలేని ఒక కఠోర వాస్తవం.
Dario Amodei (ఆంత్రోపిక్ సీఈఓ) రాసిన ‘The Adolescence of Technology’ సారాంశాన్ని చదివాను. ‘సకల వృత్తి రంగాలలోను కార్మిక మార్కెట్లను ఏఐ మనం మున్నెన్నడు చూడని రీతిలో మహా వేగంగా విచ్ఛిన్నం చేస్తుందని, చాలా ఉద్యోగాలను, ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలను సమీప భవిష్యత్తులోనే మటుమాయం చేస్తుందని’ డేరియో పేర్కొన్నారు. ఈ సంభావ్య వాస్తవం భయం కలిగించడం లేదూ? భారత్‌లో ఏఐ కులాన్ని గుర్తిస్తుందని మరో అధ్యయనం వెల్లడించింది. ఏఐకు కుల పక్షపాతాలు నేర్పితే?! ఊహించడానికే భయానకంగా లేదూ? సందేహం లేదు, ఇవి వణుకు పుట్టిస్తున్న భయాలు.
కృత్రిమ మేధ భవిష్యత్తుకు ద్వారాలు తెరిచిందని, అదృష్టానికి బాటలు వేస్తోందని మన ప్రధానమంత్రి సరిగానే చెప్పారు. మరి ఉద్యోగాలను కోల్పోతామనే భయమూ ఉన్నది. టిక్కెట్ల జారీ, వాటి తనిఖీదారులు, బస్సు, రైలు కండక్టర్లు, రైల్వే సిగ్నల్ పర్సన్స్, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్, స్టెనోగ్రాఫర్స్, టైపిస్టులు, టూరిస్ట్ గైడ్స్, ట్రాన్స్‌లేటర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, బ్యాంక్ టెల్లర్స్, ప్రైవేట్ ట్యూటర్స్ తదితర ఉద్యోగాలు అంతరించి పోతాయి. వైట్ కాలర్ ఉద్యోగాలకు సంబంధించిన చాలా పనులు స్వయంచాలకమవుతాయని మైక్రోసాప్ట్ సీఈఓ చెప్పారు. 2025లో ఆ కంపెనీ వేలాది ఉద్యోగాలను రద్దు చేసింది. తమ సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 12వేల మంది ఉద్యోగులను ‘పంపించివేస్తున్నట్టు’ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2025లోనే ప్రకటించింది. రాబోయే అయిదేళ్లలో ఐటీ సర్వీసులు అనేవి లేకుండా పోతాయని, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ సంస్థలు దాదాపుగా అదృశ్యమైపోతాయని వెంచర్ క్యాపిటలిస్ట్, టెక్నాలజీ బిలియనీర్ వినోద్ ఖోస్లా గట్టిగా చెబుతున్నారు.
ఉద్యోగాల కొరతే భారతదేశాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య. ‘అధికారిక’ గణాంకాల ప్రకారం నిరుద్యోగిత రేటు ప్రస్తుతం 5.1శాతంగా ఉన్నది. అయితే అది మరింత అధికంగా ఉండి ఉంటుందని మనకు తెలుసు. యువత నిరుద్యోగిత రేటు 15 శాతం. ‘ఉద్యోగాల్లో’ ఉన్నవారిలో 55శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నవారు లేదా రోజువారీ వేతనాల శ్రామికులే. సంపన్న ప్రాంతాలలో వ్యవసాయ కార్యకలాపాలు ఇప్పటికే యంత్రీకరణ అయ్యాయి. పట్టణ ప్రాంతాలలో బ్లూ కాలర్ ఉద్యోగాలు కూడా బాగా తగ్గిపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఉత్పత్తులు, సేవలు మొదలైన ‘నైపుణ్యాల’ రంగాలలోని విద్యావంతులైన యువతకు కూడా ఉద్యోగ రాహిత్యం వేగంగా వ్యాపిస్తోంది. పరిస్థితులు దిగజారుతూ భయానకమవుతున్నాయి.
కృత్రిమ మేధను ఉపయోగించుకోవడంలో మనమేమీ వెనుకబడి లేము. అయితే ఈ సత్వర అమలు వల్ల ఫ్యాక్టరీ ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోయాయన్నది కూడా కొట్టివేయలేని వాస్తవం. నవ సాంకేతికతల సృష్టికి, వాటి వ్యాప్తికి మధ్య కొంత వ్యవధి ఉంటుందని, ఈ వెసులుబాటు సమయంలో కఠినచర్యలు తీసుకుంటే అధునాతన సాంకేతికత వాడకంతో ఉత్పన్నమయ్యే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చని లండన్ మ్యాగజైన్ ‘ఎకనామిస్ట్’ పేర్కొంది. ఏఐ అనివార్య ప్రభావ ఉధృతికి భారత్ ఎలా సంసిద్ధమవ్వాలో చూద్దాం.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో వలే కాకుండా మన దేశంలో పాఠశాల స్థాయిలోనే విద్యాభ్యాసం నుంచి వైదొలుగుతున్న వారికోసం వివిధ రకాల ఉద్యోగాలను సృష్టించవలసిన అవసరమున్నది. అభిరుచి, ప్రతిభల ప్రాతిపదికన ఉన్నత పాఠశాల స్థాయిలో అకడమిక్, నాన్–అకడమిక్ విద్యార్థులను వేరు చేయాలి. సైన్స్ యేతర సబ్జెక్టుల్లో బహుళ సంఖ్యలో ఉన్న ‘పాస్’ కోర్సులకు స్వస్తి చెప్పి, ఆ విద్యార్థులను స్టెమ్ లేదా స్కిల్లింగ్ కోర్సుల వైపు మళ్లించాలి. విద్య, ఆరోగ్యభద్రత, పర్యావరణ నిర్వహణ రంగాలలో పెద్ద ఎత్తున మదుపులు చేయాలి. స్థానికంగా నాణ్యమైన సరుకుల, సేవల ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఇందుకు స్థానిక, ప్రాంతీయ మార్కెట్ల అవసరమైన మద్దతును బ్యాంకులు సమకూర్చాలి. బిగ్ బిజినెస్, బిగ్ మార్కెట్స్, బిగ్ చైన్స్, బిగ్ బ్యాంకులపై మోజును విడనాడాలి. ఈ దృష్ట్యా ప్రస్తుతం పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టిస్తున్నది ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) అన్న వాస్తవాన్ని గుర్తించాలి, అంగీకరించాలి. ఐటీ మంత్రి హామీ ఇచ్చినట్టుగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ఏఐ సాంకేతికతలు సమకూరితే అవి మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తాయనడంలో సందేహం లేదు. నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు భారత్ ఏటా కనీసం 80 లక్షల ఉద్యోగాలను సృష్టించవలసి ఉన్నదని సీఈఓ అన్నారు. నిజానికి అంతకంటే ఎక్కువ ఉద్యోగాలనే సృష్టించవలసి ఉన్నదన్న వాస్తవం ఆయనకు మాత్రం తెలియదా? ఏఐను ఉపయోగించుకోవడం ద్వారా ఉద్యోగాల నష్టానికి కారకులయ్యేవారు విధిగా కొత్త ఉద్యోగాలు సృష్టించవలసిన అవసరమున్నది. వారు ఈ బాధ్యత తప్పక నిర్వర్తించేలా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి.
ఉద్యోగాలు లేని లేదా కొద్ది ఉద్యోగాలు మాత్రమే ఉండే ప్రపంచం నరకప్రాయ భవిష్యత్తును చూడనున్నది. ‘పని’– మనిషిని నిర్వచిస్తుంది. ఆహారం కోసం వేటాడడం మినహా మరే జీవీ స్వచ్ఛందంగా పనిచేయదు. మనం చేసే సమస్త పనులను ఏఐనే చేసి, అందరికీ సిరిసంపదలు సమకూరిస్తే ఇక మనుషులు చేసేదేమిటి? రాబోయే కొద్ది సంవత్సరాలలోనే ఏఐ ప్రభావాల సమగ్ర స్వరూప స్వభావాలు మన అనుభవంలోకి రానున్నాయి. ఈ లోగా పై ప్రశ్న గురించి మనం లోతుగా ఆలోచించాలి.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)