Alishetty Prabhakar: స్వభావం, సాహసం అలిశెట్టి బలాలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 03:55 AM
శ్రామిక పెత్తనం ద్వారా వ్యవస్థలోని దోపిడీని రూపుమాపితేనే అందరి బతుకులు బాగుపడతాయని నమ్మి, ఆ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని వెచ్చించిన అమర కవి అలిశెట్టి ప్రభాకర్.
శ్రామిక పెత్తనం ద్వారా వ్యవస్థలోని దోపిడీని రూపుమాపితేనే అందరి బతుకులు బాగుపడతాయని నమ్మి, ఆ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని వెచ్చించిన అమర కవి అలిశెట్టి ప్రభాకర్. ఎలాంటి పరిస్థితుల్లోను ప్రలోభాలు, బెదిరింపులకు ఆయన లొంగలేదు. కవిగా తనను గుర్తించాలని, పేరు కోసం ఎన్నడూ పాకులాడలేదు. రాస్తూ రాస్తూ ‘మరణం నా చివరి చరణం కాదు’ అని ప్రకటించి భౌతికంగా నిష్క్రమించారు. దశాబ్దాలు గడచిపోతున్నా ఆయన కవిత్వం ఇంకా గుర్తుకొస్తూనే ఉంది. ఇప్పటికీ ఆయన కవితా పంక్తుల ఉటంకింపుతో ఎన్నో సామాజిక కథనాలు పరిపూర్ణతను పొందుతున్నాయి.
1954, జనవరి 12న పుట్టి, 1993లో అదే తేదీనాడు మరణించిన అలిశెట్టి బతికింది 39 ఏళ్లే. 19వ ఏట కలం పట్టిన ఆయన, మిగతా 20 ఏళ్లపాటు కవిత్వమే జీవిత పరమార్థంగా గడిపారు. చివరి పదేళ్ల కాలంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులొచ్చాయి, ఆరోగ్యం దెబ్బతిన్నది, ఆస్తులు కరిగిపోయాయి. ఇవేవీ ఆయన రచనా సంకల్పాన్ని చెదరగొట్టలేదు. కష్టాలు ఆయన కవిత్వాన్ని మరింత రాటుదేల్చాయి. తన జీవనకాంక్షను, బతుకు ఆటుపోట్లను కవిత్వంలో బలంగా చెప్పడం ద్వారా ఆయన అక్షరాలు పాఠకుల హృదయాలను సూటిగా తాకాయి. మేఘసందేశం, గబ్బిలం కావ్యాల్లో కవులు ఒక మాధ్యమం ద్వారా తమ వేదనను వ్యక్తపరచినట్లు ఈ కవి తన కష్టాలను, బాధను, అనారోగ్య పీడనను, ఆర్థిక ఇక్కట్లను మనుషులతో కాకుండా కవిత్వానికి చెప్పుకున్నారు. చివరి క్షణం వరకు కవిత్వాన్ని ఆశ్రయించారు.
స్వతహాగా అలిశెట్టి సాహసి. వ్యక్తిగత సమస్యల విషయంలో ఎదురయ్యే పర్యవసానాల పట్ల ఎప్పుడూ జంకలేదు. రేపు ఎలా అనే ఆలోచన ఆయన స్పృహలోకి వచ్చేది కాదు. ఆంధ్రజ్యోతిలో ఆరున్నరేళ్ల పాటు వచ్చిన ‘సిటీ లైఫ్’ కవితా శీర్షిక వల్ల చేతికందే పారితోషికమే చివరికాలపు జీవనాధారమైంది. తన రచనలను సినిమాల్లో వాడుకోవడానికి ఒప్పుకోలేదు. తను వేసిన కవితా చిత్రాల కాన్వాస్ బొమ్మలు కొంటామని వచ్చిన వారిని వెనక్కి పంపారు. ‘బక్క పలచనోడివి. ఒక్క దెబ్బకు చస్తావ్. ప్రభుత్వాన్ని విమర్శిస్తే బాగుండదు’ అని ఖాకీలు హెచ్చరించినా ఊరుకోలేదు. ఈ అనుభవాలన్నీ సమాజంపై కసిని ఇంకా పెంచి, ఆయనలోని కవిత్వాన్ని మరింత మండించాయి.
1992 జూలైలో వచ్చిన ‘సిటీ లైఫ్’ సంపుటిలో స్వగతంగా ఇలా రాసుకున్నారు. ‘‘రోజుకో మందు బృందంలో పాల్గొని పలుచబడుతున్న సాహిత్య భ్రష్టుల కోసమో, అవార్డుల కోసం క్యూలో నిలబడే అర్భకుల కోసమో, ఇస్త్రీ నలక్కుండా విప్లవ సందేశాలు అందించే మేధావుల కోసమో, కవిత్వంలోనూ, జీవితంలోను ద్వంద్వ ప్రమాణాల నవలంబించే దౌర్భాగ్యుల కోసమో కాక– సామాన్య పాఠకుడి కోసమే ఈ సిటీ లైఫ్‌ను ప్రచురించడానికి పూనుకున్నాను’’. ప్రభాకర్ కవిత్వం లాగే ఈ వాక్యాలు కూడా నేటి సాహిత్య వాతావరణానికి సరిగ్గా సరిపోతాయి. ఇంతగా నిలదీసేలా రాయడానికి ఒక కవికి ఎంతో నిజాయితీ గల పటిష్ఠ పునాది కావాలి. తనను వేలెత్తి చూపలేని సాహితీ జీవిత నేపథ్యం తప్పనిసరి. ఆ అధికారం ఇప్పటికీ అలిశెట్టి ప్రభాకర్‌కు ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా.
బద్రి నర్సన్