Share News

శబ్దాన్ని ఎవరూ బంధించలేరు

ABN , Publish Date - Apr 04 , 2026 | 02:40 AM

ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన కలాన్ని, గళాన్ని అంకితం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై జరిగిన కాల్పుల ఘటనకు 29 సంవత్సరాలు. అయితే ఆ దాడికి పాల్పడినవారు ఇప్పటికీ చట్టం...

శబ్దాన్ని ఎవరూ బంధించలేరు

ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన కలాన్ని, గళాన్ని అంకితం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై జరిగిన కాల్పుల ఘటనకు 29 సంవత్సరాలు. అయితే ఆ దాడికి పాల్పడినవారు ఇప్పటికీ చట్టం ముందుకు రాకపోవడం దేశంలోని విచారణ వ్యవస్థల వైఫల్యాన్ని గుర్తు చేసే బాధాకరమైన వాస్తవం. 1997 ఏప్రిల్ 6న సాయంత్రం కొందరు వ్యక్తులు గద్దర్‌ను కలవడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. తాము వరంగల్ నుంచి వచ్చామంటూ పరిచయం చేసుకుని, గద్దర్‌తో మాట్లాడుతున్న సమయంలోనే అకస్మాత్తుగా ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన గద్దర్‌ రక్తపు మడుగులో పడిపోయారు. చనిపోయాడని భావించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ప్రజల ప్రేమాభిమానం ఆయనను తిరిగి నిలబెట్టింది. మరణాన్ని జయించి మళ్లీ ప్రజల మధ్య నిలిచిన గద్దర్ కలం, గళం మరింత బలంగా మారింది. ఆ తేదీని గద్దర్ తాను పునర్జన్మించిన రోజుగా జరుపుకునేవారు.

ఇలా పాలకుల తూటాలకు, దౌర్జన్యాలకు గురైన ప్రజాగాయకులు ఎందరో దేశ దేశాన ఉన్నారు. ఏలికలు ఎక్కడి వారైనా ప్రజాపాటను అంతం చేయాలనే చూశారు. సమకాలీన చరిత్రలో విక్టర్ జారా ఉదంతం మొత్తం ప్రపంచాన్నే కదిలించింది. చిలీలో నియంత పాలకుడిని ప్రశ్నించినందుకు ప్రజాగాయకుడైన విక్టర్ జారాను 1973 సెప్టెంబర్ 11న వేలాది మంది ముందు హత్య చేశారు. పాకిస్థాన్‌లో పిల్లల కోసం కవితలు రాసినందుకు అఖ్తర్ అమీర్‌ఖాన్ మెడకు ఉరితాడు బిగిసింది. స్పానిష్ కవి గార్షియా లోర్కాను హత్య చేశారు. ఇలా ప్రపంచ ప్రసిద్ధ రచయితలు, కవులు, కళాకారులు ఎందరో పాలకులను ప్రశ్నించినందుకు నిర్బంధాలకు గురయ్యారు. వారంతా ఆత్మగౌరవ పోరాటాల పతాకలు. మానవీయ సమాజాన్ని కలగన్న వీరులు.


సమాజం నేడు ఒక విచిత్రమైన విరుద్ధతను చూస్తోంది. ఒకవైపు సాంకేతిక అభివృద్ధి, సంపద, మార్కెట్లు విస్తరిస్తున్నాయి. మరోవైపు కోట్లాది ప్రజలు ఆకలి, నిరుద్యోగం, అన్యాయం, అణచివేతలతో పోరాడుతున్నారు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, కష్టజీవుల జీవితాలు మరింత సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే అణచివేత ఉన్నచోట ప్రతిఘటన పుడుతుంది. అన్యాయం ఉన్న చోట ప్రజల స్వరం వినిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, రైతులు, ఆదివాసీలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్థులు తమ హక్కుల కోసం గళం విప్పుతున్నారు. వారి పోరాటం కేవలం అన్నం కోసం కాదు; గౌరవం కోసం... జీవన హక్కు కోసం.

ఈ ప్రజానుకూల స్వరాలను అణగదొక్కడానికి కొత్త కొత్త శక్తులు ముందుకు వస్తున్నాయి. కార్పొరేట్ లాభాల కోసం భూములను దోచుకోవడం, ప్రకృతి సంపదలను కబ్జా చేయడం, కూలీల కష్టాన్ని దోపిడీ చేయడం... వంటి వాటికి పాల్పడుతున్నాయి. ఈ అన్యాయాలను ప్రశ్నించే ప్రజా ఉద్యమాలను మౌనం చేయడానికి బెదిరింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజల హక్కుల కోసం మాట్లాడే కవులు, కళాకారులు, దళితులు, బహుజనులు, సామాజిక కార్యకర్తలు... మొదలైన వారంతా హింసకు గురవుతున్నారు.


చరిత్రలో ఎన్నోసార్లు నిరూపితమైన ఒక నిజం ఉంది. ప్రజల స్వరాన్ని తుపాకీతో ఆపలేరు. ప్రజల పాటను బుల్లెట్లతో చంపలేరు. ఈ సత్యాన్ని తన జీవితంతో చూపించిన వ్యక్తి ప్రజా యుద్ధనౌక గద్దర్. ఆయన పాటలు కేవలం సంగీతం కాదు. అవి పేదల గుండెల్లోంచి పుట్టిన నాదం. గద్దర్ పాట వేదికపై మొదలవుతుంది. కానీ అది అక్కడితో ఆగదు. ఆ పాట పొలాల్లోకి, గనుల్లోకి, బస్తీల్లోకి వెళ్తుంది. ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది! శబ్దాన్ని ఎవరూ బంధించలేరు. శబ్దాన్ని ఎవరూ ఉరి తీయలేరు. ఆ శబ్ద తరంగాలకు జీవం పోసిన మహా సాంస్కృతిక సేనాని, నాయకుడు గద్దర్ ఆరు దశాబ్దాల పాటు పేద ప్రజల ఆక్రోశాన్ని, వారి ఆవేదనను పాలకుల ఎదుట ఉంచుతూ, భావ ప్రకటనతో కూడిన శబ్ద తరంగాలను సృష్టించిన మహోన్నత వ్యక్తి.

ప్రజా యుద్ధనౌక గద్దర్ భారత రాజ్యాంగ పరిరక్షణపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సభలు, పాటలు, చర్చల ద్వారా ప్రచారం చేశాడు. చేతిలో రాజ్యాంగ పుస్తకంతో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజాస్వామ్య విలువలను వివరించాడు. అణచివేత శక్తులు ఎంత బలంగా ఉన్నా ప్రజల ఆశయాలను, ప్రజల పాటను ఆపలేవు. ఎందుకంటే ఆ పాట ఒక వ్యక్తి సృష్టి కాదు, అది కోట్లాది ప్రజల జీవితాల నుంచి పుట్టిన స్వరం. కాబట్టి ఈ కాలంలో మన బాధ్యత స్పష్టంగా ఉంది. ప్రజల హక్కుల కోసం పోరాడే స్వరాలను రక్షించాలి. ప్రజా సంస్కృతిని బలపరచాలి. ప్రజా సాంస్కృతిక ఉద్యమం మరింత బలపడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. చివరికి చరిత్రను మార్చేది అధికారాల ఆధిపత్యం కాదు, ప్రజల గళం. ప్రజల పాట. ప్రజల పోరాటం. అదే గద్దర్ చూపిన మార్గం.

-జి.వి. సూర్యకిరణ్

స్థాపకుడు, కార్యదర్శి, గద్దర్ ఫౌండేషన్

Updated Date - Apr 04 , 2026 | 02:41 AM