Share News

నిర్మలమ్మకు కనిపించని ప్రజా జీవిత వాస్తవాలు

ABN , Publish Date - Feb 07 , 2026 | 02:40 AM

ఈ నెల 1న లోక్‌సభలో 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఆ వార్షిక పద్దుపై ప్రభుత్వ ప్రతినిధులు, సంపాదకీయ రచయితలు, ఆర్థిక వ్యవహారాలపై..

నిర్మలమ్మకు కనిపించని  ప్రజా జీవిత వాస్తవాలు

ఈ నెల 1న లోక్‌సభలో 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఆ వార్షిక పద్దుపై ప్రభుత్వ ప్రతినిధులు, సంపాదకీయ రచయితలు, ఆర్థిక వ్యవహారాలపై వ్యాఖ్యాతలు, పాత్రికేయులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ‘జాగరూకత’ అనే పదాన్ని, ‘ఉన్న స్థితిని చెదరగొట్టి తలకిందులు చేయవద్దు’ (డోంట్‌ రాక్‌ ది బోట్‌) అనే పదబంధాన్ని ఉపయోగించారు.

భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఆర్థిక సర్వే 2025–26 గుర్తించింది; అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన సుంకాల సమరం భారత్‌ సరుకులపై విధించిన 50శాతం సుంకాలను 18శాతానికి తగ్గించనున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ ‘తగ్గింపు’నకు షరతులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. భారత్‌కు అమెరికన్‌ ఎగుమతులపై నయాపైసా సుంకం విధించకపోవడం, సుంకాలేతర అవరోధాలను పూర్తిగా తొలగించడం, 50,000 కోట్ల డాలర్ల విలువైన అమెరికన్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మొదలైనవి. ఇంకా ఇతర షరతులు ఉండవచ్చు. అయితే ఈ షరతులను పాటించడం భారత్‌కు సాధ్యం కాకపోవచ్చు. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావలసిన స్థాయిలో రావడం లేదు. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపుదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. నగదు సమృద్ధిగా ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు మదుపు చేసేందుకు సంకోచిస్తున్నారు. పర్యవసానంగా ‘స్థూల స్థిర మూలధన సంచయం’ భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 30శాతంగా మాత్రమే ఉండిపోయింది.


నామమాత్ర జీడీపీ వృద్ధిరేటు అసంతృప్తికరంగా ఉన్నది. జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) అనుసరించిన గణన పద్ధతులు, జాతీయ ఖాతాలపై అంతర్జాతీయ సంస్థల సందేహాలతో యథార్థ జీడీపీ వృద్ధిరేట్లపై అనుమానపు నీడలు కమ్ముకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ నిజ స్థితిగతులను అంచనా వేసేందుకు నామమాత్ర జీడీపీ ఒక మంచి సూచకం. ఇది 2023–24, 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలలో వరుసగా 12శాతం, 9.8శాతం, 8శాతం మేరకు పెరిగింది. ఏమైనా వృద్ధి వేగాన్ని కోల్పోతోంది సుమా! నిరుద్యోగిత పెరిగిపోయింది. జూన్‌ 2025లో యువజనుల నిరుద్యోగిత రేటు 15శాతంగా ఉన్నది. దేశ శ్రామిక జనవాళిలో 21.7శాతం మంది మాత్రమే క్రమబద్ధమైన వేతన ఉద్యోగాలలో ఉన్నారు. లక్షలాది యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ నిరుద్యోగులు స్వయం ఉపాధి వైపునకు మళ్లుతున్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తయారీ రంగంలో అగ్రగామి కాకుండా ఏ దేశమూ మధ్య ఆదాయ దేశంగా రూపొందదు. భారతదేశ జీడీపీలో తయారీరంగం వాటా గత పది సంవత్సరాలుగా 15 లేదా 16 శాతంగా మాత్రమే ఉంటోంది. పీఎల్‌ఐ, ఇతర పథకాలు ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమయ్యాయి; ద్రవ్య సమీకరణ బాధాకరంగా మందగించింది. ద్రవ్యలోటు 2025–26లో 4.4 శాతం నుంచి 2026–27లో 4.3శాతానికి తగ్గనున్నది. రెవెన్యూ లోటు 1.5శాతంగా ఉండిపోనున్నది. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ లక్ష్యాలను చేరుకునేందుకు 12 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పట్టవచ్చు. అందుకు మనం భారీ మూల్యమే చెల్లించనున్నాము.


ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, ఆర్థిక సర్వే మొదటి అధ్యాయంలోనే ‘జాగ్రత్తగా ఉండాలి. అయితే నిరాశావాదం అవసరం లేదు’ అని సూచించారు. ఈ ఆశావహ దృక్పథమే ఆ నివేదిక అంతటా కనిపించింది. మరో అధ్యాయంలో ప్రభుత్వం విశ్వసనీయమైన పద్ధతుల ద్వారా ప్రభుత్వ రుణాలను తగ్గించుకోవాలని, జీడీపీ–రుణాల నిష్పత్తిని కూడా బాగా తగ్గించుకోవాలని సూచించారు. పట్టణీకరణ విషయంలో మెట్రోపాలిటన్‌ పాలనా వ్యవస్థలను పటిష్ఠపరచాలని, సమృద్ధిగా నిధుల కేటాయింపులతో నగరాలకు ఆర్థిక సాధికారత కల్పించాలని పేర్కొన్నారు. పట్టణీకరణ విషయంలో ఆయన దృక్పథం సాహసోపేతంగా ఉందని చెప్పవచ్చు. 2025–26 ఆర్థిక సంవత్సరపు పన్నుల జూదం విఫలమయింది. గత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి డివిడెండ్‌ రూపంలో ఉదారంగా అందిన దాదాపు రూ.3,04,000 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో అంకెలు ఘనంగా కనిపించేందుకు దోహదం చేశాయి. అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాలలో ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్‌గా వరుసగా రూ.2,10,874 కోట్లు, రూ.2,68,590 కోట్లు సమకూరాయి. యూపీఏ ప్రభుత్వాల హయాం (2004–14)లో రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్‌ రూపంలో సమకూరిన గరిష్ఠ మొత్తం (2013–14లో) రూ.52,679 కోట్లు.

తన ప్రధాన సలహాదారు రూపొందించిన ఆర్థిక సర్వేకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిస్పందన అస్పష్టంగా ఉన్నది. తన 85 నిమిషాల బడ్జెట్‌ ప్రసంగంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించిగానీ, సుంకాలు, నిర్బంధ వాణిజ్య ఒప్పందాల రూపేణా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్‌ చేస్తోన్న ద్విముఖ దాడి గురించి ఆమె ఎటువంటి వ్యాఖ్య చేయలేదు! అంతకంతకూ మహా శక్తిమంతమవుతోన్న చైనా ఆర్థిక వ్యవస్థ గురించిగానీ, ఆర్థిక వ్యవహారాలపై మెరుగైన అవగాహన ఉన్నవారు బడ్జెట్‌ నుంచి ఆశిస్తున్న విషయాలపైగానీ ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.


ఆర్థిక మంత్రిగానీ, ప్రభుత్వంగానీ ఆర్థిక సర్వేను లెక్కలోకే తీసుకోలేదు– ఇది నేను ఉదారంగా చేస్తున్న విమర్శ. ‘మనం సౌర వ్యవస్థలోని ఒక గ్రహ వాసులమని ప్రస్తుత పాలకులు భావించడం లేదు’ అనేది నేను నిర్దయగా చేసే విమర్శ. మందగించిన వృద్ధిరేటు, పేదరికం, పెరుగుతున్న అసమానతలు, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, సంక్షేమంపై నిర్లక్ష్యం, రూపాయి విలువ తగ్గుదల మౌలిక సదుపాయాలు, అత్యవసర సేవల విషయంలో గిరాకీ, సరఫరాల మధ్య అంతరాలతో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అనుసరించనున్న విధానాలు ఏమిటో ఆర్థికమంత్రి తన ప్రసంగంలో వెల్లడించకపోవడం నన్ను నిర్ఘాంతపరిచింది.

నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ఆర్థికరంగ నిపుణులు తీవ్రంగా విమర్శించారు. భారత్‌– ప్రపంచ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటూ ప్రభుత్వం తనను తాను అభినందించుకోవడాన్ని డాక్టర్‌ సూర్జిత్‌ భల్లా ఎగతాళి చేశారు. వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని డాక్టర్‌ అశోక్‌ గులాటి గర్హించారు. ఆర్థికమంత్రి తన ప్రసంగంలో అనేక పథకాలు, కార్యక్రమాలు, మిషన్‌లు, సంస్థలు, చొరవలు, ఫండ్స్‌, కమిటీలను ప్రస్తావించారు. నా లెక్కలో అవి కనీసం 24గా ఉన్నాయి. ఆమె ప్రకటించిన ఈ పథకాలు, కార్యక్రమాలు మొదలైన వాటిలో వేటికీ నిధులు కేటాయించకపోవడం దేశ ప్రజల దృష్టికి తప్పక వస్తుంది సుమా! ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మేధా సోమరితనంతో చేసిన ఒక విన్యాసమే ఆమె సమర్పించిన 9వ కేంద్ర బడ్జెట్‌.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Feb 07 , 2026 | 02:43 AM