శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:36 AM
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు సోమవారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల కోసం తిరుమలలోని వసంతోత్సవ మండపాన్ని వట్టివేరుతో ఆకర్షణీయంగా రూపొందించారు.
తిరుమల, మార్చి 30(ఆంధ్రజ్యోతి): శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు సోమవారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల కోసం తిరుమలలోని వసంతోత్సవ మండపాన్ని వట్టివేరుతో ఆకర్షణీయంగా రూపొందించారు. వేలాడే కోతులు, ఏనుగులు, సింహాలు, పులులు, నెమళ్లు, పాములు, పలు రకాల చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేశాక ఆస్థానం నిర్వహించారు. మఽధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీభూ సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం జరిగింది. తర్వాత స్వామి అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ జీయర్‌స్వాములు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వసంతోత్సవాల్లో మంగళవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు శ్రీభూ సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో విహరించనున్నారు.