శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు
ABN , Publish Date - May 26 , 2026 | 05:14 AM
టీటీడీ చరిత్రలో రికార్డులో స్థాయిలో ఆదివారం ఒక్కరోజే 98,058 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఒక్కరోజులో 98,058 మందికి దర్శనం
హెడ్‌కౌంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇదే అధికం
తిరుమల, మే 23 (ఆంధ్రజ్యోతి): టీటీడీ చరిత్రలో రికార్డులో స్థాయిలో ఆదివారం ఒక్కరోజే 98,058 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హెడ్‌కౌంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇదే అత్యధిక సంఖ్య కావడం గమనార్హం. గత 25 రోజులుగా తిరుమలలో రద్దీ అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల ఒకటవ తేదీ నుంచి 24వ తేదీ వరకు 19.43 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేకించి శనివారం 97,561మంది, ఆదివారం 98,058మంది భక్తులు దర్శించుకున్నారు. గతంలో కంపార్టుమెంట్‌కు 500 చొప్పున లెక్కించి రోజుకు ఎంతమంది దర్శనం చేసుకున్నారో నిర్థారించేవారు. ఈ క్రమంలోనే 2016 మే 29వ తేదీన రికార్డుస్థాయిలో 1,03,384 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ అప్పట్లో ప్రకటించింది. ప్రస్తుతం ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ కూడా వినియోగంలో ఉండడంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను హెడ్‌కౌంట్ విధానంలో ప్రకటిస్తున్నారు. ఈ విధానం వచ్చిన తర్వాత ఆదివారం 98,058 మంది దర్శించుకోవడంతో రికార్డు నమోదైంది. ఇక, భక్తుల సంఖ్య సోమవారం మోస్తరుగా తగ్గింది. శ్రీవారి దర్శన సమయం 24 గంటల నుంచి 16 గంటలకు తగ్గింది.