Share News

లడ్డూ వివాదంపై నోరు అదుపులో పెట్టుకోండి

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:37 AM

తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు.

లడ్డూ వివాదంపై నోరు అదుపులో పెట్టుకోండి

  • రాజకీయ లబ్ధి కోసం దేవుడిని అడ్డుపెట్టుకోవద్దు

  • కల్తీ వాస్తవమే... చట్టం తనపని తాను చేస్తోంది

  • భక్తులను మనోవేదనకు గురిచేసేలా మాట్లాడవద్దు: నారాయణ

  • కేరళ నాయకులతో కలసి గోవిందుడిని దర్శించుకున్న సీపీఐ నేత

తిరుమల, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. కేరళకు చెందిన సీపీఐ నేతలతో కలసి ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం ముందు మీడియాతో మా ట్లాడారు. ‘పదేపదే లడ్డూల కల్తీపై మాట్లాడటం మంచిది కాదు. కల్తీ జరిగిన మాట వాస్తవమే. ఇందుకు అప్పటి టీటీడీ ఈవో సహా దోషులను శిక్షించాలి. ఈ అంశంపై చట్టం తనపని తాను చేస్తోంది. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం స్వార్థపూరితంగా లడ్డూలపై మాట్లాడుతున్నారు. ‘మీ మీ రాజకీయ లబ్ధి కోసం ఫైట్‌ చేసుకోండి. కానీ దేవుడిని అడ్డుపెట్టుకోకండి. కోట్లాది మంది భక్తులను మనోవేదనకు గురిచేసేలా అధికార, ప్రతిపక్ష పార్టీలు దయచేసి మాట్లాడవద్దు. కావలంటే కుస్తీ పట్టండి. కొట్టుకోండి, ఒకరినొకరు నరుక్కోండి. అభ్యంతరం లేదు. కాని... దేవుడిని మాత్రం అడ్డం పెట్టుకుని చేయద్దు’ అని నారాయణ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Feb 13 , 2026 | 03:37 AM