శ్రీశైలంలో భగ్గుమన్న శివస్వాములు
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:54 AM
ఊహించని విధంగా శ్రీశైలంలో శివస్వాముల రద్దీ పెరిగింది. మండల దీక్ష పూర్తిచేసుకుని పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్న జ్యోతిర్ముడి శివస్వాములకు మల్లన్న స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించాలని దేవస్ధానం నిర్ణయించింది.
స్పర్శ దర్శనంలో గందరగోళం.. బారికేడ్లు తోసేసి విధ్వంసం
శ్రీశైలం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఊహించని విధంగా శ్రీశైలంలో శివస్వాముల రద్దీ పెరిగింది. మండల దీక్ష పూర్తిచేసుకుని పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్న జ్యోతిర్ముడి శివస్వాములకు మల్లన్న స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించాలని దేవస్ధానం నిర్ణయించింది. అయితే రద్దీ కారణంగా స్వామివారి దర్శనం ఆలస్యం కావడంతో శివదీక్షాపరులు సహనం కోల్పోయి ఆందోళనకు దిగారు. జ్యోతిర్ముడి స్వాములకు సోమవారం తెల్లవారుజాము నుంచి రెండు గంటలకోసారి స్పర్శ దర్శనం కల్పించారు. శివస్వాములకు నాలుగు రోజులు మాత్రమే స్పర్శదర్శనం అవకాశం కల్పించడంతో శ్రీశైలానికి పోటెత్తారు. అయితే కొంతమంది రెండోసారి కూడా స్పర్శ దర్శనం కోసం కంపార్టుమెంట్లు, క్యూలైన్లలో చొరబడటంతో సమస్య తలెత్తింది. ఈ క్రమంలో ఉదయం 11గంటల సమయం నుంచి చంద్రావతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బారికేడ్లు, కంచెలను శివభక్తులు పూర్తిగా ధ్వంసం చేసి గుంపులుగా ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభానికి ఇరువైపులా క్యూలైన్లలో నిండిపోయారు. దీంతో రద్దీ విపరీతంగా పెరిగిపోగా, సహనం కోల్పోయిన కొందరు శివదీక్షాపరులు నినాదాలు చేస్తూ, గేట్లకు వేసిన తాళాలు పగులకొడుతూ అడ్డుకునేందుకు వచ్చిన ఆలయ అధికారులు, సిబ్బందితోపాటు సేవ చేస్తున్న శివసేవకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ రాజకుమారి పోలీసు భద్రతను పెంచారు. ఆలయ పరిసరాల్లోని క్యూలైన్లను పూర్తిగా ధ్వంసం చేసి, అధికారులపై తిరగబడుతున్న వారిని అదుపు చేసేందుకు నంద్యాల ఏఎస్పీ యుగంధర్‌బాబు సైతం రంగంలోకి దిగారు. కాగా.. రాత్రి 10 గంటలైనా శివదీక్షాధారులు ఆందోళన విరమించలేదు. ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు భక్తులకు సర్ది చెబుతున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు.