Share News

నేడు అప్పన్న చందనోత్సవం

ABN , Publish Date - Apr 20 , 2026 | 04:02 AM

సింహాచలం వరాహలక్ష్మీనృసింహ స్వామి సోమవారం నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏడాది పొడవునా స్వామికి పైపూతగా సమర్పించిన మూడు మణుగుల చందనాన్ని ఒలిచి...

నేడు అప్పన్న చందనోత్సవం

  • నిజరూపంలో దర్శనమివ్వనున్న సింహాచలేశుడు

  • ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్న హోం మంత్రి అనిత

సింహాచలం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): సింహాచలం వరాహలక్ష్మీనృసింహ స్వామి సోమవారం నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏడాది పొడవునా స్వామికి పైపూతగా సమర్పించిన మూడు మణుగుల చందనాన్ని ఒలిచి, నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పించడాన్ని చందనోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్సవంలో భాగంగా... సోమవారం వేకువజామున ఒంటి గంటకు సుప్రభాత సేవ నిర్వహించి ప్రభాత ఆరాధనలు పూర్తిచేస్తారు. సంప్రదాయ రీతిలో అర్చకులు కళ్లకు గుడ్డలు కట్టుకుని వెండి బొరిగెలతో చందనోత్తరణ చేస్తారు. ప్రభాత ఆరాధనలు, కర్పూర నీరాజనాలు సమర్పించి, దేవాలయ అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పిస్తారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 7 గంటల వరకు అప్పన్న నిజరూప దర్శనం లభిస్తుంది. రాత్రి 8 గంటలకు గంగధార పవిత్ర జలాలతో స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన అనంతరం శీతలోపచరాలు సమర్పించి, తొలివిడత చందనం సమర్పించడంతో చందనోత్సవం ముగుస్తుంది. చందనోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Updated Date - Apr 20 , 2026 | 04:03 AM