ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణం
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:13 AM
ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం వైభవంగా నిర్వహించారు.
భక్తులతో కిటకిటలాడిన కోదండ రామాలయం
ఒంటిమిట్ట, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి రోజున ఇక్కడ ధ్వజారోహణ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం వేకువజామునే సీతారామలక్ష్మణుల మూలవిరాట్‌లకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడ పటాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కంకణబట్టర్ రాజేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి గరుడ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. ఽసకల దేవతలను, నవగ్రహాలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి ధ్వజారోహణం నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. శుక్రవారం రాత్రి శ్రీరామచంద్రుడు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజంపేట సబ్‌కలెక్టర్ భావన, ఆలయ డిప్యూటీ ఈవోలు ప్రశాంతి, శివప్రసాద్, పర్యవేక్షకులు హనుమంతప్ప, తనిఖీ అధికారి నవీన్‌కుమార్ పాల్గొన్నారు.