Share News

నేడే ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణోత్సవం

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:24 AM

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం బుధవారం రాత్రి పండువెన్నెలలో జరగనుంది. ఈ కల్యాణోత్సవం కోసం రెండు నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.

నేడే ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణోత్సవం

  • పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి దంపతులు

  • 5 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు

  • 12 టన్నుల పుష్పాలతో కల్యాణ మండపం అలంకరణ

  • కల్యాణ వేదిక ప్రాంగణంలో 21 స్ర్కీన్లు

  • లక్ష మందికి సరిపడా అన్నప్రసాదాలు, లడ్డూలు

రాజంపేట/ఒంటిమిట్ట, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం బుధవారం రాత్రి పండువెన్నెలలో జరగనుంది. ఈ కల్యాణోత్సవం కోసం రెండు నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం రాత్రి జరిగే కల్యాణోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు వీక్షించడానికి అనువుగా ఆ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎస్పీ నచికేత్‌ విశ్వనాఽథ్‌ నేతృత్వంలో సుమారు 5 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాల నిఘాలో కల్యాణ వేదిక వద్ద 60 వేల మంది సౌకర్యవంతంగా కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాటుచేశారు. కల్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి మంగళవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. లక్ష మందికి పైబడి అన్న ప్రసాదాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, పానకం, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేయడానికి.. ముత్యాల తలంబ్రాలను అక్కడిక్కడే అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. కల్యాణం ప్రాంగణంలో అన్ని గ్యాలరీల్లో కూలర్లు, చలువపందిళ్లు, నీటి పిచికారి యంత్రాలు ఏర్పాటు చేశారు. కల్యాణం వీక్షణకు 21 ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు. 12 టన్నుల పుష్పాలతో కల్యాణ మండపాన్ని అలంకరిస్తున్నారు. 13 వైద్య శిబిరాలు, 250 మంది పారా మెడికల్‌ సిబ్బంది 35 మంది వైద్యనిపుణులను, 8 అంబులెన్స్‌లు, ప్రత్యేక అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 250 మరుగుదొడ్లు, ప్రాంగణం పారిశుద్ధ్యానికి 3,268 పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 2500 మంది శ్రీవారి సేవకులు కల్యాణ ప్రాంగణంలో సేవలు నిర్వహించనున్నారు.


మోహిని అలంకారంలో కోదండరాముడు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన మంగళవారం ఉదయం కోదండరాముడు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు, శ్రీవారి సేవకులు, ఒంటిమిట్ట ప్రజలు పెద్దఎత్తున స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కళాకారులు వేషధారణలు, కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో రాత్రి గరుత్మంతునిపై కొలువుదీరి కోదండరాముడు పురప్రజలకు దర్శనమిచ్చారు.

ఒంటిమిట్టలో నేడు

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుఽధవారం ఉదయం ఒంటిమిట్ట కోదండరామస్వామి శివధనుర్భాలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 11 గంటలకు స్వామివార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎరుర్కోలు, సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు సీతారాముల కల్యాణోత్సవం, అనంతరం రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు గజవాహనంపై సీతారాముల ఊరేగింపు ఉంటుంది.


సీఎం పర్యటన ఇలా..

సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను ఆయన ప్రత్యేక కార్యదర్శి ఆర్‌.కృష్ణకపర్థి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం బుధవారం సాయంత్రం నెల్లూరు నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ ప్రాంగణ సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. 4.25 గంటలకు కోదండరామ ఆలయానికి వస్తారు. 4.30 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్‌హౌ్‌సకు చేరుకుని 6.05 వరకు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత 6.30 గంటలకు కోదండరామాలయం చేరుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 6.35 గంటలకు కోదండరాముని కల్యాణోత్సవానికి హాజరై 8.30 వరకు తిలకిస్తారు. అనంతరం టీటీడీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని బసచేస్తారు. 2వ తేదీ గురువారం ఉదయం 8.40 గంటలకు ఒంటిమిట్ట నుంచి హైదరాబాదుకు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళతారు.

Updated Date - Apr 01 , 2026 | 05:25 AM