మురళీకృష్ణుడిగా లక్ష్మీనారసింహుడు
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:51 AM
లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట నృసింహుడు మురళీకృష్ణుడి...
యాదగిరికొండపై బ్రహ్మోత్సవ భక్తుల రద్దీ
యాదాద్రి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట నృసింహుడు మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చేతిలో పిల్లనగ్రోవితో వేదనాదాలను పలికిస్తూ భక్తజనాన్ని పరవశింపజేసే అలంకారంలో స్వామివారిని తిరువీధుల్లో ఊరేగించారు. పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు, వజ్ర వైఢూర్య ఆభరణాలతో దివ్యమనోహరమైన రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించారు. మరోవైపు ఆదివారం సెలవుదినం కావడంతో పాటు శుభ ముహూర్తాల కారణంగా స్వామివారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రత్యేక దర్శనాల క్యూలైన్లలో స్వామివారి దర్శనానికి 3గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. స్వామివారికి వివిధ కైంకర్యాల ద్వారా రూ.39,86,971 ఆదాయం సమకూరింది. తిరుకల్యాణోత్సవాలకు రావాలంటూ సీఎం రేవంత్‌కు ఆయన నివాసంలో ఈవో జే.భవానీ శంకర్ ఆహ్వాన పత్రిక అందజేశారు.