కన్నులపండువగా ఖాద్రీశుడి రథోత్సవం
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:37 AM
శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీవారి బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
దక్షిణాది రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు
కదిరి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీవారి బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రథోత్సవానికి ఏపీ, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఉదయం 9.04 గంటలకు బ్రహ్మరథోత్సవం మొదలైంది. శ్రీదేవీ, భూదేవీ సమేతంగా శ్రీవారిని బ్రహ్మరథంపై కొలువుదీర్చారు. రథం ముందుకు సాగుతుండగా, తిరువీధుల్లో భక్తులు స్వామివారికి దవణం, మిరియాలు, కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ రథోత్సవం కొనసాగింది. కాగా, బ్రహ్మరథోత్సవంలో చిన్నపాటి అపశ్రుతి చోటు చేసుకుంది. రథ చక్రాల కింద మొద్దులు వేసే సమయంలో విజయశేఖర్ అదుపుతప్పి కింద పడ్డారు. రథ చక్రం అతని ఎడమకాలిపైకి ఎక్కడంతో కాలు విరిగింది. అదే గ్రామానికి చెందిన నలుగురు తొక్కిసలాటలో స్వల్పంగా గాయపడ్డారు.