రేపు తిరుమలకు చంద్రబాబు
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:57 AM
తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమలకు రానున్నారు.
మనవడి పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం
21న ‘వెంగమాంబ’లో అన్నప్రసాదాల వితరణ
తిరుమల, మార్చి 18(ఆంధ్రజ్యోతి): తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమలకు రానున్నారు. ఏటా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ జన్మదినం రోజున వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చును టీటీడీకి విరాళంగా అందజేసి భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ‘ఒక్క రోజు అన్నప్రసాదం స్కీం’కు రూ.44 లక్షల విరాళాన్ని టీటీడీకి అందజేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేశ్ దంపతులు, దేవాన్ష్ శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకోనున్నారు. రాత్రికి బస చేసి 21తేదీన దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత అన్నప్రసాద భవనానికి చేరుకుని అన్నప్రసాద వితరణ చేయనున్నారు.
నేడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమల ముస్తాబైంది. శ్రీవారి ఆలయంలో గురువారం ఉగాది ఆస్థానం జరుగనుంది. పంచాంగ శ్రవణం నిర్వహించాక ఉగాది ఆస్థానాన్ని పండితులు ఆలయంలోని బంగారు వాకిలిలో శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు.