కళ్లలో కారం కొట్టి... కత్తులతో పొడిచి!
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:26 AM
తమ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై ఆమె బంధువులు హత్యాయత్నం చేశారు. కళ్లలో కారం కొట్టి..
తమ అమ్మాయిని ప్రేమ వివాహం
చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం
యాదాద్రి జిల్లాలో ఘటన
బొమ్మలరామారం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): తమ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై ఆమె బంధువులు హత్యాయత్నం చేశారు. కళ్లలో కారం కొట్టి.. కత్తులతో పొడిచి మృతి చెందాడనుకుని అక్కడి నుంచి పరారయ్యారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ యువకుడు సకాలంలో పోలీసులతో పాటు 108 అంబులెన్స్‌కు సమాచారమివ్వటంతో అతడి ప్రాణం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్‌కు చెందిన సాటల అజయ్‌కుమార్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బొమ్మలరామారం మండలం రామలింగంపల్లికి చెందిన యువతితో అతడికి కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో పరిచయం కాగా.. ఈ నెల 23న ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులతో పాటు బంధువులు ఈ నెల 24న ఆమెకు సర్దిచెప్పి అదే రోజు సొంతూరికి తీసుకొచ్చారు. అయితే యువతి బంధువులు ఆమె ఫోన్ నుంచి ఆమెకు తెలియకుండా అజయ్‌తో చాటింగ్ చేసి రామలింగంపల్లి వచ్చేట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే అతడు రామలింగంపల్లి సమీపంలోకి రాగానే కళ్లల్లో కారం చల్లి చాకుతో ఛాతీ, ముఖం, వీపు, పక్కటెముకల మీద పొడిచారు. ఈ దాడిలో అతడు మృతి చెందాడనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కొనఊపిరితో ఉన్న అజయ్ తెల్లవారుజామున 4 గంటలకు 100కి కాల్ చేయడంతోపాటు 108 అంబులెన్స్‌కు కూడా తన ఫోన్‌తో సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయాలతో ఉన్న యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అజయ్ సోదరుడు ఐలేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 8 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నారని ఎస్సై బుగ్గ శ్రీశైలం తెలిపారు.