Share News

ప్రేమికుల ఆత్మహత్య!

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:23 AM

ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి భయాందోళనకు గురై ఆ యువతి కూడా బలవన్మరణానికి పాల్పడింది.

ప్రేమికుల ఆత్మహత్య!

  • ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని ఉరేసుకున్న యువకుడు

  • విషయం తెలిసి భయాందోళనతో యువతి బలవన్మరణం

వనపర్తి, బాసర ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి భయాందోళనకు గురై ఆ యువతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా అప్పాయిపల్లి కీర్యానాయక్‌ తండాకు చెందిన గణే్‌షనాయక్‌ (21) హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం అన్నారం తండాకు చెందిన వసంత(18) నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇంజనీరింగ్‌ విద్యార్థిని. వసంత తల్లిదండ్రులు మహారాష్ట్రలో కూలీ పనులు చేస్తుండగా ఆమె బాసర ట్రిపుల్‌ఐటీ హాస్టల్‌లో ఉంటుంది. వసంత మేనత్త కుమారుడే గణేష్‌ నాయక్‌. కాగా, వసంత, గణేష్‌ నాయక్‌ మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని గణేష్‌ చేసిన ప్రతిపాదనకు వసంత నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన గణేష్‌ నాయక్‌... తన స్వగ్రామంలోని ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోపక్క, గణేష్‌ మరణ వార్త తెలిసి భయాందోళనకు గురైన వసంత బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఉంటున్న హాస్టల్‌ గదిలో తొలుత కత్తితో మణికట్టుపై గాయాలు చేసుకున్న వసంత.. తర్వాత గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. వసంతను గమనించిన తోటి విద్యార్థినులు ఆమెను క్యాంప్‌సలోని ఆస్పత్రికి వెంటనే తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. వసంత గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. గణేష్‌, వసంత ఆత్మహత్యలతో ఇరుకుటుంబాల్లో విషాదం అలుముకుంది. కాగా, ప్రేమ వ్యవహారం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ గణేష్‌ నాయక్‌ తండ్రి రత్ననాయక్‌ వనపర్తి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Feb 26 , 2026 | 02:23 AM