Share News

పదిహేనేళ్లుగా మహిళకు నరకం!

ABN , Publish Date - Jun 19 , 2026 | 02:46 AM

కుటుంబ, ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళను మోసగించి, 15 ఏళ్లకుపైగా లైంగిక వేధింపులకు గురిచేసిన దొంగ బాబాను, అతని ఏడుగురు అనుచరులను పుణె పోలీసులు అరెస్టు చేశారు.

పదిహేనేళ్లుగా మహిళకు నరకం!

  • మూత్రం తాగించి.. విద్యుత్‌ షాకులతో వేధించిన దొంగ బాబా.. పుణెలో స్వయం ప్రకటిత గురువు అకృత్యాలు

పుణె, జూన్‌ 18: కుటుంబ, ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళను మోసగించి, 15 ఏళ్లకుపైగా లైంగిక వేధింపులకు గురిచేసిన దొంగ బాబాను, అతని ఏడుగురు అనుచరులను పుణె పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన అనుచరుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. పుణె పోలీసు కమిషనర్‌ అమితేశ్‌ కుమార్‌ గురువారం ఆ వివరాలను వెల్లడించారు. వాఘోలిలోని ఉబాలెనగర్‌లో ఉన్న ఆశ్రమంపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి దొంగబాబా రాధామోహన్‌ మిశ్రా(59), అతని అనుచరుడు కన్వల్‌ నయన్‌(58), మరో ఆరుగురు మహిళా అనుచరులను అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా.. శనివారం వరకు పోలీసు కస్టడీ విధించారు. హరియాణాకు చెందిన మిశ్రా గత ఎనిమిదేళ్లుగా ఉబాలెనగర్‌లోని ఓ బంగ్లాలో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. బాధితురాలి(41) స్వస్థలం కూడా హరియాణానే. దీంతో 2001-2026 మధ్య హరియాణా, పుణెల్లో బాధితురాలిపై మిశ్రా ఈ దారుణాలకు పాల్పడ్డాడని సీపీ తెలిపారు. బాధితురాలి తండ్రి ఒక డాక్టర్‌. ఆయనకు కన్వల్‌ నయన్‌ పరిచయమవడంతో మిశ్రాకు భక్తుడిగా మారిపోయారు. అనంతరం కుటుంబసభ్యులంతా మిశ్రాకు భక్తులయ్యారు. తాను దేవుడి అవతారంగా మిశ్రా ప్రచారం చేసుకున్నాడు. విశ్వాసాన్ని పరీక్షించే పేరిట బాధితురాలిపై అనేకసార్లు మిశ్రా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ప్రవర్తన సరిగా లేదని ఆమె కుటుంబసభ్యులను నమ్మించాడు. ఆమెను సరిచేస్తానంటూ ఆశ్రమంలో ఉంచాడు. 15 ఏళ్లుగా బాధితురాలిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. బలవంతంగా మూత్రం తాగించాడు. విద్యుత్‌షాక్‌లకు గురిచేశాడు. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టారు. దీంతో మిశ్రా అనేక షరతులు విధించి ఒక మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌ ద్వారా పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. పెళ్లికి ముందే వరుడితో పారిపోమని ఆమెకు సూచించాడు.


తద్వారా ఆమె ప్రవర్తన సరిగా లేదని కుటుంబసభ్యులను నమ్మించాడు. భర్తతో గడిపిన క్షణాలను వీడియోలు తీయించాడు. ఆ వీడియోలతో ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. చివరికి ఆమెపై ఒత్తిడి తెచ్చి భర్తకు విడాకులు ఇప్పించాడు. ఆమె ఆస్తిని తనపేరిట రాయించుకున్నాడు. ఆశ్రమం నుంచి తప్పించుకోకుండా ఆమె గది చుట్టూ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశాడు. చివరికి బాధితురాలు సీసీ కెమెరాలు పగలగొట్టి ఆశ్రమం నుంచి తప్పించుకున్నారు. ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు దారుణాలను వివరించగా.. ఎట్టకేలకు బాబా అసలు స్వరూపాన్ని వారు తెలుసుకోగలిగారు. మంగళవారం రాత్రి వారంతా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. బుధవారం తెల్లవారుజామున ఆశ్రమంపై దాడిచేసి మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. ఆశ్రమం నుంచి 19 హార్డ్ డిస్క్, 12 ల్యాప్‌టా్‌పలు, ఒక ట్యాబ్‌, 11 సెల్‌ఫోన్లు, డీవీడీలు, సీడీలు, 23 పెన్‌డ్రైవ్‌లు, రూ.15 లక్షల విలువైన ఆభరణాలు, రూ.6.5 లక్షల నగదు, 10 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jun 19 , 2026 | 02:46 AM