ఒంటరితనంతో విసిగిపోయి.. కుంగిపోయి
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:38 AM
మనస్ఫర్థల కారణంగా తల్లిదండ్రులు వేరుగా జీవిస్తుండడం.. బంధువుల ఆదరాభిమానాలకు సైతం దూరం కావడం ఆ యువతిని ఒంటరిని చేసింది.
మానసిక స్థితి బాగోలేక తేజస్విని ఆత్మహత్య
పోలీసుల విచారణలో వెల్లడించిన తల్లిదండ్రులు
చెరువులో లభించిన మృతదేహం
పీర్జాదిగూడ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మనస్ఫర్థల కారణంగా తల్లిదండ్రులు వేరుగా జీవిస్తుండడం.. బంధువుల ఆదరాభిమానాలకు సైతం దూరం కావడం ఆ యువతిని ఒంటరిని చేసింది. స్నేహితులతోనూ కలవలేక, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, మేడిపల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలోని శంకర్‌నగర్‌లో... శుక్రవారం అర్ధరాత్రి తేజస్విని(25) అనే యువతి నగ్నంగా పరుగులు తీసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మేడిపల్లి పోలీసులు.. తేజస్విని తల్లి అరుణతోపాటు, విజయనగరంలో ఉంటున్న తండ్రి ఈశ్వర్‌రావును పిలిపించి విచారించారు. తేజస్విని తల్లిదండ్రులు అరుణ, ఈశ్వర్‌రావు గొడవల కారణంగా కొన్నేళ్లుగా కలసి ఉండడం లేదని తెలిసింది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న తేజస్విని మానసిక ఒత్తిడి తట్టుకోలేక దానికి రాజీనామా చేసింది. అమ్మతో కలసి స్వగ్రామం విజయనగరం జిల్లా దేవులపల్లిలో తండ్రి ఇంటికి వెళ్లింది. భర్త ఈశ్వర్‌రావుతో ఇమడలేకపోయిన అరుణ.. తిరిగి తన కుమార్తె తేజస్విని తీసుకొని ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. కాప్రాలో కొన్ని రోజులు ఒక ఇంట్లో అద్దెకున్నారు. అర్ధరాత్రి వేళ కుమార్తెకు పీడ కలలు వస్తుండడంతో.. మళ్లీ జూన్ 13న మేడిపల్లి శంకర్‌నగర్‌లో మరో ఇంటికి చేరుకోగా, చివరికి ఈ విషాదం చోటుచేసుకుంది.
సీసీ ఫుటేజీల ఆధారంగా ఆచూకీ
ఉదయం నిద్రలేచిన తేజస్విని తల్లి అరుణ పక్కింటి వారి సాయంతో బయటకు వచ్చారు. మరోవైపు బీరప్ప దేవాలయంలో అమ్మవారి విగ్రహం కనిపించకపోవడంతో ఆలయ కమిటీ ప్రతినిదులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ యువతి నగ్నంగా ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాన్ని తీసుకొని చెరువు వైపు వెళ్లిందని గమనించారు. చెరువు వద్ద వెతకడంతో సమీపంలోనే అమ్మవారి చీర కనిపించింది. అక్కడే చెరువులో నీటిపై యువతి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తేజస్విని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, చెరువులో పడవేసిన అమ్మవారి విగ్రహం మాత్రం దొరకలేదు.