ప్రేమ వివాదంలో ఇరుక్కున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:45 AM
సొంత అన్న సాగించిన ప్రేమాయణం.. ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు బలిగొంది. అన్న ప్రేమ వ్యవహారంలో తలెత్తిన గొడవలు, ఆపై ఎదుర్కొన్న పరిణామాలతో...
వికారాబాద్ జిల్లాలో ఘటన
ధారూరు, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): సొంత అన్న సాగించిన ప్రేమాయణం.. ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు బలిగొంది. అన్న ప్రేమ వ్యవహారంలో తలెత్తిన గొడవలు, ఆపై ఎదుర్కొన్న పరిణామాలతో ఓ మహిళా కానిస్టేబుల్ మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా ధారూరులో బుధవారం ఉదయం జరిగింది. ధారూరుకు చెందిన డేగావత్ తులసీబాయి(23).. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ.. స్థానికంగా ఓ గదిలో అద్దెకు నివసిస్తోంది. తులసీబాయి అన్న రాజు వికారాబాద్‌లోనే ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. అదే ఆస్పత్రిలో పనిచేస్తోన్న మౌనికతో రాజుకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆ యువతిని ఏడాదిగా తులసి గదిలోనే ఉంచాడు. అయితే, కొద్ది రోజల క్రితం ప్రేమికుల మధ్య గొడవలు రావడంతో మౌనిక వెళ్లిపోయింది. దీంతో రాజు గతంలో మౌనికతో కలిసి దిగిన ఫొటోలు వైరల్ చేసి బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఈ నెల 27న కుటుంబసభ్యులతో కలిసి వచ్చి వికారాబాద్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజు తనను వేధిస్తున్నాడని, అతడి చెల్లెలు ఏఆర్ కానిస్టేబుల్ తులసిబాయి కూడా సహకరిస్తోందని పేర్కొంది. అన్న ప్రేమ వ్యవహారం వల్ల తాను చిక్కుల్లో పడ్డాననే ఆవేదనతో తులసీబాయి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.