Share News

ఇన్‌స్టా ఇమేజ్‌తోనే ఉగ్రవాద ఊబిలోకి

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:06 AM

సయిదా బేగం! పాతబస్తీకి చెందిన ఈమె, ఇన్‌స్టా రీల్స్‌ ఇమేజ్‌తోనే తెలిసి తెలిసే ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కుకుందా? లేదంటే వలపు వలకు బలైందా....

ఇన్‌స్టా ఇమేజ్‌తోనే ఉగ్రవాద ఊబిలోకి

  • నలభై మందితో వాట్సాప్‌ గ్రూప్‌.. చాటింగ్‌

  • 7 రాష్ట్రాల వారితో నెట్‌లో ఐసిస్‌ కార్యకలాపాలు

  • కటకటాల వెనుక పాతబస్తీకి చెందిన సయిదా బేగం

దిల్‌సుఖ్‌నగర్‌/సైదాబాద్‌/చాదర్‌ఘాట్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): సయిదా బేగం! పాతబస్తీకి చెందిన ఈమె, ఇన్‌స్టా రీల్స్‌ ఇమేజ్‌తోనే తెలిసి తెలిసే ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కుకుందా? లేదంటే వలపు వలకు బలైందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. చంచల్‌గూడకు చెందిన సయిదా బేగం అలియాస్‌ అయేషా బేగం (38)కు పదేళ్ల క్రితం విజయవాడకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. భర్తతో కలిసి ఆమె అక్కడే ఉండేది. మద్యానికి బానిసైన భర్త నిత్యం సయీదాతో గొడవపడి ఆమెను కొట్టేవాడు. భర్త వేధింపులు భరించలేక ఏడాది క్రితం అతడితో విడిపోయి ఆరేళ్ల కుమారుడిని వెంటబెట్టుకొని చంచల్‌గూడలోని తల్లిదండ్రుల వద్దకొచ్చింది. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లోని మూడు ఇళ్లలో పనిచేసేది. ఉర్దూ గజల్స్‌ పాడుతూ అందరినీ ఆకట్టుకునేది. సయిదా తాను పనిచేసే చోట, ఇంట్లో రాత్రి సమయాల్లో ఎక్కువగా సెల్‌ఫోన్‌లో ఇన్‌స్టా రీల్స్‌ చూసేది. తాను చేస్తున్న వంటలపై, వివిధ రకాల కుట్టు తయారీలపై, గజల్స్‌పై రీల్స్‌ చేసి రోజూ ఇన్‌స్టాలో పోస్ట్‌చేసేది. కొన్ని నెలల్లోనే 30వేల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. రీల్స్‌కు ఇన్‌స్టా నుంచి డబ్బులు వస్తుండటంతో దాన్నే ఆదాయ వనరుగా మార్చుకుంది. సయిదా తండ్రి ఓ పాఠశాల వద్ద పుస్తక విక్రయ దుకాణంలో పనిచేస్తున్నాడు. తల్లి క్యాన్సర్‌ రోగి. ఆ తల్లి.. మరో పెళ్లి చేసుకోవాలంటూ సయిదాపై ఒత్తిడి చేయసాగింది. దీంతో సయిదా.. తనకో తోడు కావాంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. సయిదా పోస్టును చూసిన విజయవాడకు చెందిన ఓ ఉగ్రవాది తాను పోలీసునంటూ పరిచయం చేసుకున్నాడు. తన భార్యతో గొడవలున్నాయని ఆమెను వదిలేసి తననే పెళ్లి చేసుకుంటానని సయీదాకు చెప్పాడు.


అతడి మాటలను నమ్మిన సయిదా బేగం రోజూ అతడితో వాట్సా్‌పలో చాటింగ్‌ చేసేది. సయిదా ఇన్‌స్టాలో వేలాది మందిని ప్రభావితం చేస్తున్న తీరును గమనించిన ఆ ఉగ్రవాది ఆమెను తమ కార్యకలాపాల వ్యాప్తికి అస్త్రంగా మలచుకున్నాడు. ఆమెను కలిసి తన మాటాలతో ఆకర్షించి తమ పోస్టులను ప్రచారం చేసేలా ఒప్పించాడు. తమ ఉగ్రవాద సందేశాలను సయిదా బేగం ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా ప్రమోట్‌ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల పోస్టులకు ప్రభావితమైన సయిదా బేగం.. అతడు చెప్పినట్లు చేసేది. ఈ క్రమంలోనే విదేశీ హ్యాండ్లర్‌ అల్‌-హకీమ్‌ షుక్రూ మార్గదర్శకత్వంలో రహస్య సోషల్‌మీడియా నెట్‌వర్క్‌ చేపట్టింది. సుమారు 7 రాష్ట్రాలకు చెందిన 42మందితో ఓ వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి తీవ్రవాద కార్యకలాపాలను ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె కార్యకలాపాలపై నిఘా పెట్టిన విజయవాడ పోలీసులు సయిదా బేగంను అదుపులోకి తీసుకున్నారు. కాగా తల్లిదండ్రులు ఇటీవల సయీదాకు ఓ పెళ్లి సంబంధం తీసుకువచ్చారు. పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి పలు షరతులు పెట్టాడు. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని చెప్పడంతో అందులోని కొన్ని సందేశాలను, రీల్స్‌ను సయిదా డిలీట్‌ చేసినట్లు సమాచారం. కాగా సయిదా అరెస్టయ్యాక ఆమె కుటుంబసభ్యులను ఎంబీటీ నేత అంజాదుల్లాఖాన్‌ పరామర్శించారు.

Updated Date - Mar 27 , 2026 | 04:06 AM