Share News

వన్యప్రాణులను వేటాడి తింటున్న ముఠా అరెస్టు

ABN , Publish Date - May 06 , 2026 | 06:56 AM

నెమలి, జింక, కుందేలు వంటి వన్యప్రాణులను వేటాడి చంపి, వండుకొని తిని మిగిలిన అవశేషాలను జూరాల కాలువలో పడేస్తున్న ఓ ముఠాకు చెందిన ఆరుగురిని హైదరాబాద్‌ సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

వన్యప్రాణులను వేటాడి తింటున్న ముఠా అరెస్టు

  • నాలుగు ఎయిర్‌గన్‌లు, ఓ రైఫిల్‌ 20 తూటాలు, ఓ కారు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, మే 5(ఆంధ్రజ్యోతి): నెమలి, జింక, కుందేలు వంటి వన్యప్రాణులను వేటాడి చంపి, వండుకొని తిని మిగిలిన అవశేషాలను జూరాల కాలువలో పడేస్తున్న ఓ ముఠాకు చెందిన ఆరుగురిని హైదరాబాద్‌ సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాస్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్‌ ముజఫర్‌ హుేస్సన్‌ అలియాస్‌ గుడ్డు(42), అబ్దుల్లా బిన్‌ సహైన్‌(27), సౌద్‌ బిన్‌ మొహమ్మద్‌ బలాబ్‌(41), మసూద్‌ బిన్‌ మొహమ్మద్‌(43), జడ్చర్లకు చెందిన మీర్‌ అహ్మద్‌ అమీర్‌(27), మక్తల్‌కు చెందిన కావ లి శేఖర్‌(38) ఓ ముఠాగా ఏర్పడి వన్యప్రాణుల వేటను అలవాటుగా మార్చుకున్నారు. మక్తల్‌ ప్రాంతానికి చెందిన కావలి శేఖర్‌ వన్యప్రాణుల జాడపై ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ముఠా ఏడాదిగా షాద్‌నగర్‌, మక్తల్‌ అటవీ ప్రాంతాలలో అనేకసార్లు వేటాడింది. వీరంతా ఎయిర్‌గన్‌ల సాయంతో నెమళ్లు, జింకలను కాల్చి చంపి వాటి మాంసాన్ని వండుకుని తినేవారు. ఆ తర్వాత మిగిలిన చ ర్మం, తలలు, ఇతర అవశేషాలను జూరాల బ్యాక్‌ వాటర్స్‌ కాలువలో పడేసేవారు. నిందితులో ఒకరైన మీర్‌ అహ్మద్‌ అమీర్‌ తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌లో షూటర్‌ కాగా తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ ఆయుధాన్నే వేటకు వాడేవాడు. అయితే, కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ (గోల్కొండ టీమ్‌), అటవీ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో వీరంతా అరెస్టు అయ్యారు. నిందితుల నుంచి వేట వీడియోలు ఉన్న మొబైల్‌ ఫోన్లు, నాలుగు ఎయిర్‌ గన్‌లు, ఓ రైఫిల్‌, 20 తూటాలు, స్కార్పియో కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Updated Date - May 06 , 2026 | 06:56 AM