Share News

భర్తను చంపి.. ప్రమాదంగా చిత్రీకరించి..

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:56 AM

తన భర్త మెట్లమీద నుంచి పడిపోయి, చనిపోయాడంటూ అందర్నీ నమ్మించేందుకు ఆమె చేసిన యత్నం ఫలించలేదు.

భర్తను చంపి.. ప్రమాదంగా చిత్రీకరించి..

  • ఓ భార్య దురాగతం.. హత్యేనని తేల్చిన పోస్టుమార్టం నివేదిక

  • భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి అనుమానాలు

  • కొన్నాళ్లుగా ఇంట్లో ఎవరికి వారే అన్నట్టుగానే.. నిత్యం గొడవలు

  • భర్త తనను కొట్టడంతో గొంతుకు చున్నీ బిగించి చంపిన భార్య

  • కూకట్‌పల్లిలో ఘటన.. 28 రోజుల తర్వాత వీడిన మిస్టరీ

హైదరాబాద్‌ సిటీ/కేపీహెచ్‌బీకాలనీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): తన భర్త మెట్లమీద నుంచి పడిపోయి, చనిపోయాడంటూ అందర్నీ నమ్మించేందుకు ఆమె చేసిన యత్నం ఫలించలేదు. హత్యేనని పోస్టుమార్టం రిపోర్టు అసలు నిజాన్ని తేల్చింది! ఆ నివేదిక ఆధారంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే నిజాన్ని కక్కింది. తానే మెడకు చున్నీ బిగిం చి భర్తను హత్యచేశానని అంగీకరించింది. కూకట్‌పల్లిలో ఈ ఘటన వెలుగుచూసింది. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన జగవరపు సుధీర్‌ రెడ్డి, జగవరపు బ్రహ్మజ్ఞాన ప్రసన్న భార్యాభర్తలు. వీరికి 16, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. ఉపాధి కోసం సుధీర్‌ రెడ్డి, భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌ వచ్చాడు. కూకట్‌పల్లి పరిధిలోని ఈనాడు హైట్స్‌లో ఈ కుటుంబం ఉంటోంది. సుధీర్‌రెడ్డి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రసన్న ఇంట్లోనే ఉంటోం ది. అయితే ఇటీవల భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి అనుమానం ఏర్పడింది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందని సుధీర్‌ రెడ్డి అనుమానిస్తే, భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని ప్రసన్న అనుమానం పెంచుకుంది. మనస్పర్థలు పెరగడంతో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటు న్నా ఇద్దరూ ఎవరికి వారే అన్నట్టుగానే ఉంటున్నారు. కొన్నాళ్లుగా సుధీర్‌ రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి ప్రసన్నను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. గతనెల 23న సాయంత్రం తాగొచ్చిన సుధీర్‌ గొడవపడి భార్యను కొట్టాడు. కోపం పట్టలేక ప్రసన్న అతడిని తిరిగి కొట్టింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న సుధీర్‌ రెడ్డి మెట్లపై నుంచి కిందపడ్డాడు. పైకి లేచిన అతడు, మళ్లీ ప్రసన్నను కొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె తన చున్నీని సుధీర్‌ మెడకు బిగించడంతో అతడు ప్రాణాలు విడిచాడు.


డయల్‌-100కు ఫోన్‌ చేసి..

సుధీర్‌ చనిపోయాక.. ప్రసన్న డయల్‌-100కు ఫోన్‌ చేసి, మద్యం మత్తులో భర్త మెట్లపై నుంచి కిందపడి ప్రాణాలు విడిచాడంటూ పోలీసులకు చెప్పింది. వారొచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. గొంతుపై గాయాలను చూసి ప్రశ్నించగా.. కిందపడ్డాక పక్కనే ఉన్న మంచం అతడి గొంతుపై పడి గాయమైందని చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. 28 రోజుల తర్వాత పోస్టుమార్టం నివేదికొచ్చింది. గొం తుపై తాడులాంటిది బలంగా బిగించడంతోనే సుధీర్‌ మృతిచెందినట్లు నివేదికలో వెల్లడైంది. ప్రసన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తానే హత్యచేసినట్లు వెల్లడించింది. తనకు భర్తను చంపాలన్న ఉద్దేశం లేదని, తనపై అతడు దాడికి పాల్పడటంతో క్షణికావేశంలో హత్య చేశానని చెప్పిం ది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు, అరెస్టు చేసి, కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jan 21 , 2026 | 04:56 AM