Share News

Family Dispute: భర్తను కొట్టి చంపిన భార్యాపిల్లలు

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:35 AM

కుటుంబ కలహాలతో కట్టుకున్న భర్తను భార్య తన పిల్లలతో కలిసి కొట్టి చంపిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది.

Family Dispute: భర్తను కొట్టి చంపిన భార్యాపిల్లలు

  • కుటుంబ కలహాలే కారణం

మహబూబ్‌నగర్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : కుటుంబ కలహాలతో కట్టుకున్న భర్తను భార్య తన పిల్లలతో కలిసి కొట్టి చంపిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. రూరల్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఎంప్లాయీస్‌ కాలనీలో నివాసం ఉంటున్న పండ్ల వ్యాపారి విస్లావత్‌ రాములు(56)కు అతని భార్యకు మధ్య పదేళ్లుగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయతీలు జరిగాయి. అయినా అతనిలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి కూడా గొడవలు జరగడంతో క్షణికావేశానికి లోనైన భార్య సూర్తి, పిల్లలు సవిత, పాండు కలిసి రాములుపై దాడి చేశారు. అందుబాటులో ఉన్న కర్రలు, రాడ్‌లతో కొట్టారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో రాములు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. పాండు ఇంటర్‌ చదువుతుండగా, సవిత ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. వీరి మరో కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. జరిగిన విషయాన్ని బంధువులకు నిందితులు ఫోన్‌ ద్వారా చెప్పారు. దీంతో హైదరాబాద్‌ అంబర్‌పేటలో ఉంటున్న మృతుడి వదిన లక్ష్మి కుటుంబసభ్యులు హుటాహుటిన వచ్చారు. రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్యాపిల్లలపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. నిందితులు ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 08 , 2026 | 04:35 AM