వాచ్‌మన్ దంపతుల దారుణ హత్య
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:16 AM
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్‌మన్‌గా పని చేస్తున్న ఆ దంపతులు నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు.
నిద్రిస్తున్న వారిని రాడ్‌తో కొట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
పటాన్‌చెరు పరిధిలో ఘటన
పదో తరగతి పరీక్షకు హాజరైన ఆ దంపతుల కుమార్తె
తల్లిదండ్రుల మరణవార్త ఆమెకు తెలియకుండా దాచిన బంధువులు
పటాన్‌చెరు, గూడూరు (మహబూబాబాద్ జిల్లా), మార్చి14 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్‌మన్‌గా పని చేస్తున్న ఆ దంపతులు నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. ఓ వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతున్న ఆ దంపతుల కుమార్తె.. శనివారం పదో తరగతి పరీక్షకు హాజరైంది. పరీక్ష ముగిసిన తర్వాత అమ్మానాన్న ఇక లేరని తెలుసుకొని కుదేలైపోయింది. శేరిలింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివా్‌సరావు కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సూర్యతండాకు చెందిన ధరావత్ సోము (50) మంగమ్మ (45) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మౌనికకు పెళ్లి జరిపించారు. చిన్న కుమార్తె వసంత గూడూరులోని ఓ వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతోంది. స్వగ్రామంలో వ్యవసాయ భూమిని కౌలుకి ఇచ్చిన సోము దంపతులు మూడేళ్ల క్రితం వలస వచ్చారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం పురపాలక పరిధి సిటిజన్ కాలనీలో వెంకటేశ్వరరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనం పక్కనే గుడిసెలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి దంపతులు గుడిసెలో నిద్రించారు. శనివారం ఉదయం వారు బయటకు రాకపోవడంతో పని చేయడానికి వచ్చిన కార్మికులు గుడిసె తలుపు తీసి చూశారు. దంపతులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి బిల్డర్‌కు సమాచారం ఇచ్చారు. బిల్డర్ ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.
భార్యాభర్తలు నిద్రలో ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు తలపై ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దంపతులు భద్రత కోసం తమ వద్ద ఉంచుకున్న రాడ్‌తోనే వారిని కొట్టి చంపినట్టు సమాచారం. మరోపక్క, పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సోము, మంగమ్మ దంపతుల మరణ వార్త ను వారి చిన్నకుమార్తె వసంతకు తెలియకుండా సూర్యతండా వాసులు, బంధువులు దాచిపెట్టారు. ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాసి వచ్చిన వసంతను.. వసతి గృహం వార్డెన్ స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఇంటికి చేరుకోగానే అమ్మానాన్న ఇకలేరనే విష యం తెలుసుకున్న వసంత బోరున విలపించింది.