Share News

నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:07 AM

వరంగల్‌ జిల్లాలో నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపింది. రాయపర్తి మండలంలోని ఓ తండాకు చెందిన యువతిని ఆమె ప్రేమికుడు మరో....

నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

  • ప్రేమికుడే స్నేహితులతో కలిసి రేప్‌ చేసి.. చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు

  • పోలీసులు పట్టించుకోవట్లేదు కుటుంబీకుల ఆరోపణ.. ఆందోళన

  • వరంగల్‌ జిల్లాలో కలకలం

రాయపర్తి/వర్ధన్నపేట, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లాలో నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపింది. రాయపర్తి మండలంలోని ఓ తండాకు చెందిన యువతిని ఆమె ప్రేమికుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గంజాయి మత్తులో గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపి.. ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ హైవేపై తండావాసులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్న సదరు యువతి తండాలో పెదనాన్న కుటుంబంతో కలిసి ఉంటోంది. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో డాబాపైనా నిద్రించిన ఆమె... అర్ధరాత్రి డాబా దిగింది. ఆపై మళ్లీ పైకి వెళ్లలేదు. తెల్లవారాక కుటుంబీకులు కిందికి వచ్చి చూడగా.. ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. అయితే మరో తండాకు చెందిన నలుగురు యువకులే గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపేశారంటూ కుటుంబసభ్యులు, తండావాసులు ఆరోపిస్తున్నారు. 2 రోజుల కిందట సదరు యువకులు వచ్చి యువతిని కలిశారని చెబుతున్నారు. యువతి కాళ్లపై గాయాలున్నాయని, ఇంట్లో సైతం రక్తపు మరకలు కనిపించాయంటున్నారు. గదిలో ఆమె ఆత్మహత్య చేసుకుంటే బయట నుంచి ఎవరు గడియ పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పట్టించుకోవట్లేదంటూ బాధిత కుటుంబీకులు, తండావాసులతో కలిసి వర్ధన్నపేట రహదారిపై ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనుమానిత నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 10 , 2026 | 05:07 AM