అత్తమామల హత్య కేసులో అల్లుడికి ఉరిశిక్ష
ABN , Publish Date - May 21 , 2026 | 03:51 AM
భార్యను కాపురానికి పంపలేదనే కక్షతో అత్తమామలను దారుణంగా హతమార్చిన ఘటనలో ఓ అల్లుడికి వరంగల్ జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది.
చెన్నారావుపేట/ వరంగల్ లీగల్, మే 20 (ఆంధ్రజ్యోతి): భార్యను కాపురానికి పంపలేదనే కక్షతో అత్తమామలను దారుణంగా హతమార్చిన ఘటనలో ఓ అల్లుడికి వరంగల్ జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. అదేవిధంగా రూ.5వేల జరిమానా విధించింది. నిందితుడు మేకల నాగరాజుకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు లభించడంతో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి మైత్రేయి బుధవారం ఈ సంచలన తీర్పు వెలువరించారు. చెన్నారావుపేట మండలం పదహారు చింతల్ తండాకు చెందిన బానోత్ సుగుణ- శ్రీను దంపతుల కుమార్తె దీపికను.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన మేకల నాగరాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, భర్త ప్రవర్తన నచ్చక పెళ్లి అయిన కొద్దిరోజులకే దీపిక పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో తరచూ దీపిక ఇంటికి వచ్చి తనతో రావాలని, లేదంటే కుటుంబసభ్యులను చంపేస్తానని నాగరాజు బెదిరించేవాడు. భార్యను పంపడం లేదనే నెపంతో అత్తమామలపై కక్ష పెంచుకుని.. 2024 జూలై 11 అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో దారుణంగా హత్య చేశాడు. అడ్డు వచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై సైతం దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరుసటి రోజు నాగరాజును అరెస్టు చేశారు. కాగా, కోర్టు తీర్పు పట్ల తండావాసులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చడం గమనార్హం.