యూట్యూబ్ చూసి.. చైన్‌స్నాచింగ్
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:19 AM
యూట్యూబ్‌లో చూసి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన తల్లీకొడుకులను పెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఐదు తులాల బంగారు గొలుసులు ..
విశాఖలో తల్లీ కొడుకు అరెస్టు
ఐదు తులాల బంగారు గొలుసులు స్వాధీనం
పెందుర్తి (విశాఖపట్నం), జూలై 6 (ఆంధ్రజ్యోతి): యూట్యూబ్‌లో చూసి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన తల్లీకొడుకులను పెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఐదు తులాల బంగారు గొలుసులు (రెండు) స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ అన్నాబత్తుల వెంకటరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుజాతనగర్‌లో నివసిస్తున్న కిలపర్తి చల్లాయమ్మ (65) గత నెల 27వ తేదీ సాయంత్రం ద్వారకానగర్‌లో గల బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లేందుకు నడుచుకుంటూ సుజాతనగర్ బస్టాప్ వద్దకు బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ ప్లే స్కూల్ వద్దకు వచ్చేసరికి స్కూటీపై మాస్క్ ధరించిన మహిళ, యువకుడు ఆమె వద్దకు వచ్చి ఏదో అడ్రస్ అడిగారు. ఆమె అడ్రస్ చెబుతుండగానే బైక్ వెనుక కూర్చున్న మహిళ దిగి చెల్లాయమ్మ మెడలోని ఐదు తులాల రెండు బంగారు గొలుసులు లాక్కుంది. లిప్తపాటులో అక్కడి నుంచి ఇద్దరూ ఉడాయించారు. బాధితురాలు పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఎస్‌ఐ సూరిబాబు ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలించాయి. మర్రిపాలెంలోని ఒక మెడికల్ స్టోర్స్ వద్ద అదే బైక్‌పై మహిళ, యువకుడు ఉన్న దృశ్యం సీసీ ఫుటేజీ ద్వారా లభ్యంకావడంతో పోలీసులు ఆరా తీశారు. అక్కడ మాస్క్‌లు కొనుగోలు చేశారని తెలుసుకున్నారు. చోరీకి పాల్పడినవారు నగరంలోని రామాటాకీస్ ప్రాంతానికి చెందిన తల్లీకొడుకులు మాధివాడ ధనలక్ష్మి (38), అక్షిత్ (19)గా గుర్తించారు. పోలీసుల విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు.