Share News

భర్తతో టూర్‌కు వెళ్లి.. విశాఖ టెకీ అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:33 AM

భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌ టూర్‌కు వెళ్లిన విశాఖపట్నానికి చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనుమానాస్పదంగా మరణించారు. అక్కడ ఓ హోటల్‌ రూమ్‌లో శరీరంపై బట్టలు లేకుండా, నేలపై మూత్రం మడుగులో..

భర్తతో టూర్‌కు వెళ్లి.. విశాఖ టెకీ అనుమానాస్పద మృతి

  • ఉత్తరాఖండ్‌లోని ఓ హోటల్‌ రూమ్‌లో శరీరంపై బట్టలు కూడా లేని స్థితిలో..

  • మూత్రం, రక్తం మడుగులో మృతదేహం

  • రాత్రంతా మద్యం తాగిన భార్యాభర్తలు

  • ఉదయం లేచి చూసే సరికి విగతజీవిగా భార్య

విశాఖపట్నం, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌ టూర్‌కు వెళ్లిన విశాఖపట్నానికి చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనుమానాస్పదంగా మరణించారు. అక్కడ ఓ హోటల్‌ రూమ్‌లో శరీరంపై బట్టలు లేకుండా, నేలపై మూత్రం మడుగులో, ముక్కు నుంచి రక్తం కారుతున్న స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దీనిపై సమాచారం అందడంతో చినముషిడివాడలోని బాధిత కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. కొంతమంది ముస్సోరి బయలుదేరి వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన పి.రాధా గాయత్రి (27) గుర్‌గావ్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు విశాఖకే చెందిన, పుణేలో ఐటీ సెక్టార్‌లో పనిచేసే శ్రీచరణ్‌తో గతేడాది నవంబరు 8న వివాహం జరిగింది. గాయత్రి ఢిల్లీలోని కిద్వాయ్‌ నగర్‌ ఈస్టులో నివాసం ఉంటోంది. వీరిద్దరూ కలిసి విహారయాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌ వెళ్లారు. ఈ నెల 13న శనివారం ఢిల్లీ నుంచి రిషికేష్‌కు ప్రయాణించారు. ఆ తర్వాతి రోజు ఆదివారం రాత్రి ముస్సోరి సమీపంలోని తిప్రిధార్‌లో కియానా హోమ్‌స్టే అనే హోటల్‌కు చేరుకున్నారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రూమ్‌కు వెళ్లారు. భర్త చెప్పిన దాని ప్రకారం.. భార్యభర్తలిద్దరూ రాత్రంతా మద్యం తాగారు. తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రపోయారు. ఈ క్రమంలో ఉదయం లేచి చూసేసరికి.. గాయత్రి ఒంటిపై బట్టలు లేకుండా, నేలపై మూత్రం మడుగులో, ముక్కు నుంచి రక్తం కారుతున్న స్థితిలో కనిపించిందని ఆమె భర్త శ్రీచరణ్‌ చెబుతున్నారు. దీనిపై సోమవారం ఉదయం సమాచారం అందుకున్న వెంటనే తాము అక్కడకు చేరుకున్నామని ఉత్తరాఖండ్‌ పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలోనే ఆమె మృతిచెందినట్లు అంబులెన్స్‌ సిబ్బంది నిర్ధారించారు. మృతురాలి శరీరం నగ్నంగా ఉండడం, బెడ్‌షీట్‌పై రక్తం మరకలు ఉండడాన్ని గుర్తించామని చెప్పారు. అలాగే రూమ్‌లో ఉన్న రెండు ఖాళీ లిక్కర్‌ బాటిళ్లు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గాయత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డెహ్రాడూన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షను కెమెరాలో రికార్డు చేయాలని వైద్యులను కోరినట్లు ఉత్తరాఖండ్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - Jun 17 , 2026 | 04:34 AM