Share News

స్నేహితుడి ఫ్లాట్‌లోనే చంపి..!

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:17 AM

విశాఖ పరిధిలోని గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మౌనికను హత్య చేసింది తన ఫ్లాట్‌లో కాదని, స్నేహితుడి ఫ్లాట్‌లోనని తేలింది.

స్నేహితుడి ఫ్లాట్‌లోనే చంపి..!

  • మృతదేహం ట్రావెల్‌ బ్యాగ్‌లో తన ఫ్లాట్‌కు తరలింపు

  • మౌనిక హత్య కేసులో కొత్త మలుపు

  • కస్టడీలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు

  • సీసీ కెమెరాల్లో లభించిన ఆధారాలు

గాజువాక, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ పరిధిలోని గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మౌనికను హత్య చేసింది తన ఫ్లాట్‌లో కాదని, స్నేహితుడి ఫ్లాట్‌లోనని తేలింది. హత్యానంతరం మౌనిక శరీర భాగాలను ట్రావెల్‌ బ్యాగ్‌లో అక్కడి నుంచి తన ఫ్లాట్‌కు తరలించినట్టు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివరాలివీ.. గత నెల 29న గాజువాక ఎల్‌వీ నగర్‌లో సంజీవయ్య నగర్‌కు చెందిన మౌనికను నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్ర హత్య చేసి, స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన పోలీసులు రవీంద్ర ఫ్లాట్‌లోనే హత్య జరిగినట్టు భావించారు. ఆ తరువాత నిందితుడు నివసించే కీర్తి ఎన్‌క్లేవ్‌తో పాటు తల, చేతులను కాల్చిన అడవివరం సమీప దారపాలెంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. కీర్తి ఎన్‌క్లేవ్‌లో హత్య జరిగిన రోజు గానీ, ముందు మూడురోజులు గానీ మౌనిక వచ్చినట్టు సీసీ కెమెరాలతో పాటు ఏ విధమైన ఆధారాలూ లభించలేదు. దీంతో రిమాండ్‌లో ఉన్న రవీంద్రను మూడు రోజుల కస్టడీకి తీసుకుని సోమవారం విచారణ ప్రారంభించిన పోలీసులకు మరిన్ని విషయాలు తెలిశాయి. మౌనికను తన ఫ్లాట్‌లో హత్య చేయలేదని, సమీపంలోని స్నేహితుడు సురేంద్ర ఫ్లాట్‌లో చంపానని నిందితుడు అసలు గుట్టు విప్పాడు. మృతదేహాన్ని పెద్ద ట్రావెల్‌ బ్యాగులో పెట్టుకుని తాను నివసిస్తున్న కీర్తి ఎన్‌క్లేవ్‌కు తీసుకు వెళ్లాడు. తన ఫ్లాట్‌లోనే మృతదేహాన్ని కత్తితో ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టాడు. అనంతరం తల, చేతులను దారపాలెం తీసుకువెళ్లి తగలబెట్టాడు. జరిగిన విషయాన్ని సురేంద్రకు ఫోన్‌ చేసి చెప్పగా.. పోలీసులకు లొంగిపోవాలని అతడు సూచించాడు. ఈలోగా రవీంద్రను అతడి తమ్ముడు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించాడు. ఈ హత్యకేసులో రవీంద్ర ఒక్కడే పాల్గొన్నాడని సీఐ పార్థసారథి బుధవారం విలేకరులకు తెలిపారు.

Updated Date - Apr 09 , 2026 | 06:19 AM