Share News

రోడ్డు ప్రమాదం.. యువకుడిపై హత్యాయత్నం కేసు

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:34 AM

అనుకోకుండా జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైన యువకుడిపై వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.

రోడ్డు ప్రమాదం.. యువకుడిపై హత్యాయత్నం కేసు

  • పోలీసుల అత్యుత్సాహం.. రిమాండ్‌కు తరలింపు

  • ఉద్యోగావకాశం కోల్పోయిన యువకుడు

  • ఇది కుట్ర అంటూ ఎస్పీకి యువకుడి తండ్రి ఫిర్యాదు

  • సాధారణ ఫిర్యాదే చేశాం : ప్రమాద బాధితులు

పెద్దేముల్‌, జూన్‌13 (ఆంధ్రజ్యోతి): అనుకోకుండా జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైన యువకుడిపై వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఆ యువకుడు ప్రస్తుతం రిమాండ్‌లో ఉండగా... తమపై కక్షతోఎవరో కుట్ర చేసి తన కొడుకుపై ఇంత పెద్ద కేసు పెట్టారని ఆరోపిస్తున్న ఆ యువకుడి తండ్రి న్యాయం చేయండంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోపక్క, బాధితుల ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతుండగా... తాము సాధారణ ఫిర్యాదే చేశామని ప్రమాద బాధితుడి కుటుంబసభ్యులు చెబుతుండడం కొసమెరుపు. అసలేం జరిగిందంటే.. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌లో ఈనెల 2న ఓ స్కూటర్‌, బైక్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న మంబాపూర్‌ గ్రామానికి చెందిన జాఫర్‌కు చేయి రెండు చోట్ల విరిగింది. దీంతో స్కూటర్‌ నడిపిన అదే గ్రామానికే చెందిన అనిర్వే్‌షపై జాఫర్‌ కుటుంబసభ్యులు పెద్దేముల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. స్పందించిన పోలీసులు అనిర్వే్‌షపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే, రోడ్డు ప్రమాదం అనుకోకుండా జరిగిందని, దీనిపై విచారణ చేపట్టకుండా హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఏంటని అనిర్వేష్‌ తండ్రి శ్రీనివాస్‌ ప్రశ్నిస్తున్నారు. హత్యాయత్నం కేసు పెట్టి అనిర్వే్‌షను రిమాండ్‌కు పంపడంతో.. ఈనెల 9న పోస్టల్‌ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాల్సిన తమ కుమారుడు ఆ అవకాశాన్ని కోల్పోయాడని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. కాగా, తాము సాధారణ ఫిర్యాదే చేశామని, అనిర్వేష్‌ కుటుంబంతో తమకు ఎలాంటి గొడవలు లేవని, తమను వాడుకొని ఎవరో అనిర్వేష్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయించారంటూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన జాఫర్‌ సోదరుడు మహమ్మద్‌ మోయిజ్‌ ఓ వీడియో విడుదల చేశారు. చిన్న విషయానికి అంతపెద్ద శిక్ష పడడం పట్ల తాము కూడా బాదపడుతున్నామని చెప్పారు.

ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి : అనిర్వేష్‌ తండ్రి

పెద్దేముల్‌ ఎస్‌ఐ మా కుమారుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గాయపడిన యువకుడి సోదరుడు కూడా ప్రమాదం జరిగింది, న్యాయం చేయండనే కోరారు. కానీ స్థానిక రాజకీయ నేతల ప్రోద్బలంతో మాఅబ్బాయిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తప్పుడు కేసునమోదు చేసిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి.

మోయిజ్‌ ఫిర్యాదు మేరకే కేసు నమోదు: ఎస్‌ఐ

ప్రమాదంలో గాయపడిన జాఫర్‌ సోదరుడు మోయిజ్‌ చేసిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాము. వారు ఏదో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుని మాట్లాడుతుంటే కాదు కదా. మావద్ద వారు మాట్లాడిన ఆడియో ఉంది. సాక్ష్యాలు న్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాం.

Updated Date - Jun 14 , 2026 | 04:34 AM