Share News

పగలు కూలీ.. రాత్రి దొంగ

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:12 AM

పగలు కూలీ పనులు చేసుకునే వ్యక్తిగా చలామణీ అవ్వడం.. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో రాత్రిళ్లు చోరీలకు పాల్పడడం.. చోరీ చేసిన నగలను ఉత్తరప్రదేశ్‌లో అమ్మడం..

పగలు కూలీ.. రాత్రి దొంగ

  • చోరీ సొమ్ముతో జల్సాలు, సేవా కార్యక్రమాలు

  • కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ వికా్‌ససింగ్‌ను కటకటాల్లోకి నెట్టిన వికారాబాద్‌ పోలీసులు

వికారాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పగలు కూలీ పనులు చేసుకునే వ్యక్తిగా చలామణీ అవ్వడం.. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో రాత్రిళ్లు చోరీలకు పాల్పడడం.. చోరీ చేసిన నగలను ఉత్తరప్రదేశ్‌లో అమ్మడం.. చేతికొచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం.. ఆపై సామాజిక సేవా కార్యక్రమాలు చేయడాన్ని అలవాటుగా చేసుకున్న వికా్‌ససింగ్‌ అనే కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగను వికారాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 15 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా గురువారం విలేకరులకు వెల్లడించారు. వికారాబాద్‌, మణికంఠనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో మే ఒకటో తేదీ రాత్రి ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.2.10 లక్షల నగదు చోరీ జరిగింది. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో చోరీకి పాల్పడింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్‌ సింగ్‌ అలియాస్‌ తేజాసింగ్‌గా గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో వికాస్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. పోలీసు విచారణలో వికాస్‌ సింగ్‌ తన నేర చరిత్రను బయటపెట్టాడు. యూపీకి చెందిన వికాస్‌ సింగ్‌ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో నివసిస్తున్నాడు. చిన్నతనంలోనే చోరీలు ప్రారంభించిన వికాస్‌ సింగ్‌.. ఉదయం కూలీ పనులు చేస్తున్నట్టు నటిస్తూ రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేస్తుంటాడు. 16 ఏళ్ల వయస్సులోనే నేర జీవితాన్ని ప్రారంభించిన వికా్‌సపై తెలంగాణలోనే 61 వరకు చోరీ కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. 2024 జూన్‌ తర్వాత వికారాబాద్‌ జిల్లా, సైబరాబాద్‌, మల్కాజిగిరి పరిధిలో 27 దొంగతనాలకు పాల్పడిన వికాస్‌ సింగ్‌.. 157 తులాల బంగారం, 256 తులాల వెండి, రూ.8,22,500 నగదు దొంగిలించాడు. చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను యూపీలోని సుల్తాన్‌పూర్‌ జిల్లా, కుర్వర్‌, గంజేరి, భగ్‌వాన్‌పూర్‌లకు చెందిన వ్యాపారులకు విక్రయిస్తుంటాడు. చోరీ సొమ్ముతో వికాస్‌ సింగ్‌ జల్సాలు, విహార యాత్రలు చేస్తుంటాడు. అలాగే, హెల్పింగ్‌ హ్యాండ్‌ అనే స్వచ్ఛంద సంస్థ పేరిట తన స్వగ్రామంలోని పిల్లలకు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగులు కూడా పంపిణీ చేస్తుంటాడు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా తనపై ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంటున్నాడు. చివరికి తాజా కేసులో వికారాబాద్‌ పోలీసులకు చిక్కిన వికాస్‌ సింగ్‌.. 2024, జూన్‌ 26 నుంచి ఇప్పటి వరకు చేసిన నేరాలను అంగీకరించాడు.

Updated Date - Jun 05 , 2026 | 04:12 AM