Share News

ప్రేమ వివాదంలో ఇరుక్కొని..

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:42 AM

ప్రేమ వ్యవహారంలో తలెత్తిన గొడవలు.. ఆపై జరిగిన పరిణామాలు ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్ల ప్రాణాలను బలి తీసుకున్నాయి.

ప్రేమ వివాదంలో ఇరుక్కొని..

  • నెల రోజుల వ్యవధిలో అన్నాచెల్లెళ్ల ఆత్మహత్య

  • వికారాబాద్‌ జిల్లా థరూరులో ఘటన

ధారూరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రేమ వ్యవహారంలో తలెత్తిన గొడవలు.. ఆపై జరిగిన పరిణామాలు ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్ల ప్రాణాలను బలి తీసుకున్నాయి. అన్న ప్రేమ తగాదాలో తన పేరును పోలీసు కేసులో చేర్చడం, బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపం చెంది నెల క్రితం చెల్లెలు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా అన్న కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా థరూరు మండలంలో గురువారం చోటు చేసుకుంది. ధారూరుకు చెందిన డెగావత్‌ రాజు(30) వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అక్కడ నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన మౌనికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ వచ్చి విడిపోయారు. ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం కాగా, పాత ఫొటోలతో రాజు తనను వేధిస్తున్నాడని, అతని చెల్లెలు ఏఆర్‌ కానిస్టేబుల్‌ తులసి బాయి అన్నకు సహకరిస్తోందని ఏప్రిల్‌ 27న వికారాబాద్‌ పోలీసుస్టేషన్‌లో మౌనిక ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మౌనిక బంధువులు బెదిరించారంటూ మనస్తాపానికి గురై.. తులసిబాయి ఏప్రిల్‌ 29న ఆత్మహత్య చేసుకుంది. చెల్లెలి మరణం తర్వాత కూడా యువతి బంధువులు రాజుపై దాడి చేసి బెదిరింపులకు గురి చేశారని, అది తట్టుకోలేక తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి రాములు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, రాజు జేబులో దొరికిన నోట్‌లో తన చావుకు ఎండీ రహీం, మౌనిక, మహేందర్‌, మధు, చందు, జానకికారణమని రాసి ఉంది. పోలీసుల నుంచి తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ మృతుడి కుటుంబీకులు, గ్రామస్థులు రాజు మృతదేహంతో వికారాబాద్‌-తాండూర్‌ రోడ్డుపై మూడు గంటల పాటు ధర్నా చేశారు.

Updated Date - Jun 05 , 2026 | 04:42 AM