పిస్టల్‌తో పోలీసులపై కాల్పుల యత్నం
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:27 AM
లాడ్జిలో తనిఖీలకు వచ్చిన పోలీసులపై యువకుడు పిస్టల్‌తో కాల్పులకు యత్నించాడు. ట్రిగ్గర్ లాక్ అవడంతో అది పేలలేదు. శనివారం ఉదయం విజయవాడలో జరిగిందీ ఘటన.
లాడ్జిలో తనిఖీకి వచ్చినవారిపై తెలంగాణ యువకుడి హల్‌చల్
పేలకపోవడంతో పోలీసులను పక్కకు తోసేసి పరార్
వెంబడించి పట్టుకున్న బెజవాడ పోలీసులు
విజయవాడ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): లాడ్జిలో తనిఖీలకు వచ్చిన పోలీసులపై యువకుడు పిస్టల్‌తో కాల్పులకు యత్నించాడు. ట్రిగ్గర్ లాక్ అవడంతో అది పేలలేదు. శనివారం ఉదయం విజయవాడలో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన కనకం మురళీ పటేల్ హైదరాబాద్‌లో సినీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. రైలులో పరిచయమైన సోను అనే యువకుడి ద్వారా ఆరు నెలల క్రితం బిహార్‌లో 7ఎంఎం పిస్టల్‌ను కొన్నాడు. గుంటూరు జిల్లా పెదకాకానిలో జరుగుతున్న గుడారాల పండుగ కోసం ఈనెల 3న ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చాడు. బస్టాండ్ వద్ద కృష్ణలంక వైపు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న షిరిడీ బాలాజీ లాడ్జిలో బస చేశాడు. ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా ఈగల్ బృందాలు, కృష్ణలంక పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా శనివారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్ చేపట్టారు. కృష్ణలంక స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ విజయ సారధి నాయక్ బృందం ఉదయం ఆరు గంటలకు లాడ్జిలో మురళీ ఉన్న గదిలోకి ప్రవేశించి తనిఖీలు చేస్తుండగా ఓ బ్యాగు నుంచి పటేల్ పిస్టల్‌ను తీసి నాయక్‌కు గురిపెట్టాడు. తుపాకీ పేలకపోవడంతో నాయక్‌ను తోసేసి పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. నిందితుడు లాడ్జి నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వైపు పరుగెడుతూ మరో రెండుసార్లు పోలీసులపై కాల్పులకు యత్నించాడు. ఎట్టకేలకు నెహ్రూ బస్టాండ్ ఎదురుగా రైల్వే ట్రాక్ సమీపంలో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ రాయితో కొట్టగా నిందితుడు కిందపడ్డాడు. పిస్టల్ ఎందుకు కొన్నావని పోలీసులు ప్రశ్నించగా, స్వగ్రామంలో కొంతమందితో తనకు గొడవలు ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది. నిందితుడి నుంచి ఐదు బుల్లెట్లు, పెప్పర్ స్ర్పే, ఎలక్ట్రికల్ షాకింగ్ గన్ కూడా స్వాధీనం చేసుకున్నారు.