సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్..!
ABN , Publish Date - May 06 , 2026 | 05:16 AM
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిని గుర్తించి వారికి ‘శాప్’ సర్టిఫికెట్ ఇప్పిస్తానని ఎర వేస్తాడు. మ్యాట్రిమోనీ సైట్లలో రిజిస్టర్ చేసుకుని.. అమ్మాయిలకు వల విసురుతాడు.
‘శాప్’ సర్టిఫికెట్ పేరిట మోసం
రూ 50 వేల వరకు వసూలు
మ్యాట్రిమోనీ సైట్లలో యువతులకు వల
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వ్యాపారం పేరిట లక్షల్లో వసూళ్లు
యువతి ఫిర్యాదుతో ‘ఈ కాప్స్’కు చిక్కిన టెకీ
విజయవాడ, మే 5(ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిని గుర్తించి వారికి ‘శాప్’ సర్టిఫికెట్ ఇప్పిస్తానని ఎర వేస్తాడు. మ్యాట్రిమోనీ సైట్లలో రిజిస్టర్ చేసుకుని.. అమ్మాయిలకు వల విసురుతాడు. ప్రేమ, పెళ్లి అని నమ్మిస్తాడు. ఆపై తన వ్యాపార అవసరాల కోసం డబ్బు కావాలని చెప్పి వారి నుంచి లక్షలు కాజేస్తాడు. ఇలా వివిధ రాష్ట్రాల్లో సుమారు 2-3 కోట్ల మేర మోసాలకు పాల్పడిన ఓ టెకీని ‘ఈ కాప్స్’ మంగళవారం అరెస్టు చేశారు. ఆయనపై వివిధ రాష్ట్రాల్లో 10 కేసులు ఉన్నాయని, మొత్తం 110 మందిని మోసం చేశాడని గుర్తించారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన పొన్నాటి శ్రీనివాస్ కిరణ్‌బాబు (38) ఎంసీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్, ముంబైలో పలు ఐటీ కంపెనీల్లో పనిచేశాడు. తర్వాత బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి మోసాలకు పూనుకున్నాడు. అవివాహితుడైన కిరణ్ బాబు వివిధ మ్యాట్రిమోనీ, షాదీ.కామ్ వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేసుకుని.. అమ్మాయిలకు ఎర వేసేవాడు. డేటింగ్ యాప్‌ల్లోనూ కొంతమందిని ట్రాప్ చేసేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు. తాను వ్యాపారం చేస్తానని డబ్బులు వసూలు చేసేవాడు. ఆయన మాయమాటలు నమ్మి ఓ యువతి రూ.20 లక్షలు, మరో మహిళ ఏకంగా రూ.44 లక్షలు ఇచ్చి మోసపోయారు.
నేరానికో సిమ్, ఫోన్..
కిరణ్‌బాబు శాప్ (సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్) సర్టిఫికెట్ల పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారికి వల వేసేవాడు. ఇదొక సాఫ్ట్‌వేర్ టూల్ అని.. దీన్ని పెద్దపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో, వ్యాపారాల్లో వినియోగిస్తారని చెప్పేవాడు. నౌకరీ.కామ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని టార్గెట్ చేసి.. వారికి శాప్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పేవాడు. వారి నుంచి రూ.30-50 వేల వరకు లాగేవాడు. డబ్బులు ఖాతాకు రాగానే తన సిమ్ కార్డులు పడేసేవాడు. ఫోన్‌ను అమ్మేసేవాడు. అతడు నేరాలకు ఉపయోగించే సిమ్ కార్డులను కాకినాడ జగన్నాథపురంలో ఓ యువకుడు యాక్టివేట్ చేస్తున్నట్టు గుర్తించారు. సిమ్ కార్డులు కొనడానికి వచ్చిన వారి వివరాలతో ఆ సిమ్‌లు యాక్టివేట్ చేస్తున్నట్టు కనుగొన్నారు.
వేధింపులతో చిక్కాడు..
విజయవాడకు చెందిన ఓ వైద్యుడి కుమార్తె సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మరో కంపెనీలో అవకాశం కోసం ఆమె నౌకరీ.కామ్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ఫోన్ నంబరు సేకరించిన కిరణ్.. ఓ కంపెనీ శాప్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పాడు. ఆమెకు అనుమానం వచ్చి ఆ కంపెనీ గురించి గూగుల్‌లో సెర్చ్ చేయగా ఎక్కడా కనిపించలేదు. ఆమె నిలదీయడంతో వాట్సా్‌పలో అసభ్యకర సందేశాలు పంపాడు. ఆమె ఆ నంబరును బ్లాక్ చేసినా.. మరో కొత్త నంబరుతో వేధించాడు. ఆమె ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి కిరణ్‌బాబును అరెస్టు చేశారు.