Share News

భార్య, ఇద్దరు పిల్లల్ని నీటి సంపులో పడేసి..ఆపై ఉరేసుకొని కౌలు రైతు బలవన్మరణం

ABN , Publish Date - May 28 , 2026 | 03:46 AM

అతనో రైతు.. 50 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. తోటకు మందులు కొట్టడానికి అప్పులు చేశారు. ఆయనకు ప్రమాదం జరగడం, భార్య అనారోగ్యానికి గురవడంతో...

భార్య, ఇద్దరు పిల్లల్ని నీటి సంపులో పడేసి..ఆపై ఉరేసుకొని కౌలు రైతు బలవన్మరణం

  • అప్పుల బాధ భరించలేక తీవ్ర నిర్ణయం

  • రూ.60 లక్షలు తీసుకుంటే రూ.1.20 కోట్లకు పత్రాలు రాయించుకున్నారంటూ ఆవేదన

  • చిత్రహింసలు భరించలేకపోతున్నానంటూ వాట్సాప్‌ స్టేటస్‌

ఖిల్లాగణపురం, మే 27 (ఆంధ్రజ్యోతి): అతనో రైతు.. 50 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. తోటకు మందులు కొట్టడానికి అప్పులు చేశారు. ఆయనకు ప్రమాదం జరగడం, భార్య అనారోగ్యానికి గురవడంతో వైద్యానికి రూ.25 లక్షల వరకు అప్పులు చేశారు. రుణాలు ఇచ్చిన వారి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో భార్య, కుమార్తె, కుమారుడ్ని నీటి సంపులో ముంచి.. ఆపై తాను ఉరేసుకొని తనువు చాలించారు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలంలోని సల్కెలాపూర్‌లో జరిగింది. దేవరకద్ర మండలం డోకూర్‌కు చెందిన గంగల నరసింహులు(36) హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసరావు మామిడి తోటను నాలుగేళ్ల కిందట కౌలుకు తీసుకున్నారు. 50 ఎకరాల తోటకు ఏడాదికి రూ.15 లక్షల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. తోటకు పెట్టుబడితోపాటు తనకు, భార్యకు చికిత్స కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశారు. అయితే రూ.60 లక్షలు అప్పు ఉంటే రూ.1.20 కోట్లకు పత్రాలు రాయించుకున్నారని నరసింహులు వాపోయినట్లు బంధువులు తెలిపారు. వ్యాపారులకు రూ.3 వడ్డీ చెల్లిస్తూ వచ్చానని, మొత్తంగా రూ.2 కోట్ల అప్పులు చూపిస్తున్నారని, రుణాల భారం మోయలేక, చిత్రహింసలు భరించలేక తన జీవితం ముగిస్తున్నానంటూ ఆత్మహత్య చేసుకునే ముందు నరసింహులు వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టారు. హైకోర్టులో ఐపీ తీసుకున్నా అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తున్నారని, జీవితాన్ని క్లోజ్‌ చేస్తున్నానని గద్వాలలోని బంధువు దరిశెల్లికి ఫోన్‌ చేసి వాపోయారు. నరసింహులు తన భార్య హేమలత(31), కుమారుడు సాయి నిహాల్‌(15), సాహితీశ్రీ(13) చేతులను కట్టేసి మామిడి తోట నీటి సంపులో పడేయడంతో వారు మరణించారు. ఆ తర్వాత అతను తోటలోని షెడ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - May 28 , 2026 | 03:46 AM